ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్ కు నందమూరి హరికృష్ణ మరణం దిగ్భ్రాంతిని కలిగించడంతో సోషల్ మీడియా ద్వారా హరికృష్ణ గొప్పదనాన్ని తెలిజేసేలా ఓ ఓల్డ్ ఫోటో ని అప్లోడ్ చేసి హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈ ఫోటో 1962 లో జాతీయ రక్షణ ఫండ్ కి ఎన్.టి.ఆర్ విరాళాలు సేకరిస్తున్న సమయం లోనిది. అంత చిన్న వయసులోనే తండ్రి ముందు నడుస్తూ ,తండ్రి అడుగుజాడల్లో ఎదిగిన హరికృష్ణ గొప్పదనాన్ని వివరించాలనుకున్న క్రిష్ “మార్పుకోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఎన్.టి.ఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎన్.టి.ఆర్ చేసిన చైతన్య రథ యాత్రలో రథ సారథిగా వ్యవహరించిన హరికృష్ణ నాన్నకు చేయూతగా నిలిచి ముందుండి నడిపించారు. అలాంటి వ్యక్తి ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎంతో బాధాకరమైన విషయం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రను కల్యాణ్‌రామ్ పోషిస్తారని ప్రచారం జరుగుతున్నా, చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. మరి వెండితెరపై హరికృష్ణ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.