‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. తాజాగా హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ బేనర్‌పై బి.ఎ.రాజు నిర్మాతగా జయ బి. రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’. అపార్ట్‌మెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో క్యూట్ లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా సమపాళ్ళలో ఎలివేట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.తో జరిపిన ఇంటర్వ్యూ.
‘వైశాఖం’ జర్నీ ఎలా వుంది?
– ఇది చాలా టఫ్ జర్నీ అనే చెప్పాలి. చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. నేను అనుకున్నది అనుకున్నట్టు రావాలంటే చాలా విషయాలు కలవాలి. అలా జరగడం కోసం చాలా కష్టపడ్డాను. ఉదాహరణకి కజక్‌స్తాన్ టూరిస్ట్‌గా వెళ్ళడమే కష్టం. అలాంటిది 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులు ట్రావెల్ చేసి సాంగ్స్ తీశానంటే ఎలా వుంటుందో ఊహించుకోండి. కేవలం ప్రాసెస్ అయి పాస్‌పోర్టులు రావడానికే మూడు నెలలు పైన పట్టింది. అక్కడ షూట్ చెయ్యడం చాలా కష్టం. మూడు రోజులకోసారి పాస్‌పోర్ట్ స్టాంపింగ్ చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూడునెలలు జైలు తప్పదు.
ఈనెల 21న సినిమా రిలీజ్ అవుతోంది. మీకెలా అనిపిస్తోంది?
– గత రెండు నెలలుగా సినిమా ఎప్పుడు రిలీజ్ అని అందరూ ఎంతో ఆసక్తిగా అడుగుతున్నారు. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మీలాగే నేను కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఎప్పుడు చూడాలా? అనే ఆతృత నాక్కూడా వుంది. దానికి కారణం వుంది. గత సంవత్సరంగా ఈ సినిమాతో నేను ట్రావెల్ చేశాను. ప్రతి ఫ్రేమ్ చాలా కమాండింగ్, ఇంట్రెస్టింగ్‌గా రావాలని చాలా కేర్ తీసుకున్నాను. ఇంతకుముందు సినిమాలకు, ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ వుంటుంది. ఆ సినిమాలకు టైమ్ చూసుకునేదాన్ని. తొందరగా బడ్జెట్‌లో సినిమా తీసేసి ఇంట్రెస్ట్ పెరగకుండా, ప్రొడ్యూసర్‌కి బర్డెన్ అవ్వకుండా చెయ్యాలనే ఆతృత వుండేది. ఈ సినిమా విషయంలో చాలా కమిటెడ్‌గా, కూల్‌గా వర్క్ చేశాను. అది మీకు ట్రైలర్స్ చూస్తేనే అర్థమై వుంటుంది.
హీరో, హీరోయిన్ పెర్‌ఫార్మెన్స్ ఎలా వుంటుంది?
– సినిమాలో నటించిన ఆర్టిస్టులంతా ఎంతో బాగా చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు. చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతారు. మా హీరో నిర్మాతల హీరో. మంచి బిహేవియర్ వున్న వ్యక్తి. చాలా బాగా చేశాడు. కొత్త హీరో, హీరోయిన్‌లను చూస్తున్నామన్న ఫీలింగ్ మీకు ఎక్కడా రాదు.
సాయికుమార్ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
– సాయికుమార్‌గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టరే కథని మలుపు తిప్పుతుంది.
‘వైశాఖం’ ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది?
– ఒక సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ ఆడియన్స్ ఒక స్టేజ్‌లో మర్చిపోతారు. జీవితాన్ని, రియల్ లైఫ్‌ని ఫాలో అవుతున్నాం అనుకుంటారు. క్యారెక్టర్స్‌తో పాటు మీరూ ట్రావెల్ అవుతారు. అది మాత్రం నేను ఖచ్ఛితంగా చెప్పగలను. ఎప్పుడూ కొత్తవారిని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ సినిమాలో కూడా కొత్తవారు వున్నారు. ఫైనల్‌గా సినిమా బాగా వచ్చింది. బాగా వచ్చిందనేది నేను చెప్పడం కాదు. పాటలు చూసినవారు, సినిమాను చూసిన సెన్సార్ వారు చెప్పారు. సినిమా చాలా బాగుంది. రియల్ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు చాలా ఫేస్ చేశాము అని సెన్సార్ ఆఫీసర్‌గారు చెప్పడమే కాకుండా ఇంత మంచి సినిమా తీసినందుకు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మా సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది మంచి ఫ్యామిలీ సినిమా. యు ఇవ్వమని అడిగాము. మీ మిగతా సినిమాలకన్నా ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువ దట్టించారు. కాబట్టి యు/ఎ ఇవ్వాల్సిందేనని నవ్వుతూ చెప్పారు. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ చాలా రొమాంటిక్‌గా వుంటుంది. కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా వుంటాయి. ఇది బేసిక్‌గా ఇంటెన్స్ లవ్‌స్టోరీ. సినిమాలో సింగిల్ కట్ కూడా చెప్పలేదు. మీరు తీసిన సినిమాని ఇలాగే జనం చూడాలి. నేను కట్ చేసేది ఏమీ లేదు అన్నారు. దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరంపాటు ఈ సినిమాని తీర్చిదిద్దాం అని చెప్పొచ్చు. సింగిల్ ఫ్రేమ్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మా సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకటసుబ్బారావుగారు డి.ఐ., సి.జి. వర్క్ బాగా చేయించారు.
మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువైంది?
– ఇది వాస్తవం. ఈసారి బడ్జెట్ ఎక్కువైంది. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్‌గా తీసుకున్న సినిమా. ప్రేక్షకులు, ఇండస్ట్రీ ‘వైశాఖం’ చాలా బాగుంది, చాలా గ్రాండ్‌గా వుంది అని చెప్పుకోవాలి అనే ఇంటెన్షన్‌తో తీసిన సినిమా.
మీ సినిమాల్లో అన్నీ హిట్ సాంగ్సే వుంటాయి. ఈ సినిమా పాటల విషయంలో ఇంకా కేర్ తీసుకున్నట్టున్నారు?
– అవునండీ. నేను వసంత్‌ని ప్రిఫర్ చేసినపుడు నా ఫ్రెండ్స్, మీడియా, శ్రేయోభిలాషులంతా పాతవాళ్ళయితే బాగుంటుందని చెప్పారు. కానీ, పట్టుదలతో వసంత్‌తోనే ట్యూన్స్ చేయించాను. ట్యూన్స్ చేసినపుడే నాకు తెలుసు. ఒక గ్రాండియర్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ ట్యూన్స్ చేయించాను. ముఖ్యంగా రామజోగయ్యశాస్త్రిగారు రాసిన లాస్ట్ సాంగ్ ‘కంట్రీ చిలకా..’. ఓ వారం పదిరోజులు ఆ పాట విన్నాను. ఈ పాట మన సినిమాలో పెట్టుకోవాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే మహేష్, ఎన్టీఆర్ మీద తియ్యాల్సిన పాట అది. అంత గ్రాండియర్, అంత ఫాస్ట్ వుండే ఆ పాటని మన హీరో, హీరోయిన్ చెయ్యగలరా? అనుకుని కూడా మనం చెయ్యాలి, మన సినిమాలో ఆ పాట వుంటే బాగుంటుంది, ఒక విజువల్ ట్రీట్‌గా ఆడియన్స్‌కి ఇవ్వాలి, మనం కూడా అలాంటి సాంగ్ తియ్యగలం అని చూపించాలి అని ఒక ఛాలెంజ్‌తో చేసిన పాట. ఈ పాటను శేఖర్ మాస్టర్ చేశారు. పాట విని ఆయన షాక్ అయ్యారు. మన హీరో, హీరోయిన్ మీదే ఈ పాటను తీద్దామనుకున్నారా? అని అడిగారు. ఆయన కూడా ఈ పాటని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 8 గంటల చొప్పున 15 రోజులపాటు ఈ పాట కోసం ప్రాక్టీస్ చేయించారు. అంటే ఈ పాట కోసం హీరో, హీరోయిన్, శేఖర్ మాస్టర్, నేను ఎంత కష్ట పడ్డామో తెలుస్తుంది. పాటల విషయంలో అంత కేర్ తీసుకున్నాం కాబట్టే ఆడియో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పటివరకు సినిమాలో ఫలానా పాట బాగాలేదు అని చెప్పినవారు లేరు. అందరూ యునానిమస్‌గా పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయని చెప్పారు. ఈ క్రెడిట్ వసంత్‌కి ఇవ్వాలి. 21నన ఈ పాటల్ని థియేటర్‌లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ వుంది.
అపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో కథ చెప్పడానికి రీజన్ ఏదైనా వుందా?
– ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అన్నీ మినీ ఫ్యామిలీసే. పల్లెటూళ్ళో కూడా అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చింది. ఇండివిడ్యువల్ ఇళ్ళు మెయిన్‌టెయిన్ చేసే కెపాసిటీ తగ్గింది. అందరూ అపార్ట్‌మెంట్స్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్స్‌లో రకరకాల మనుషులు వుంటారు. వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్, వాళ్ళ మధ్య వుండే రిలేషన్స్‌షిప్స్ అనేవి ఎలా వుంటాయి అనేది ఒక రియాలిటీ. అంటే ఒక యదార్థ గాధని ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాను.
బడ్జెట్ విషయంలో వెనకాడకుండా సినిమాని ఇంత రిచ్‌గా తియ్యడానికి మిమ్మల్ని ప్రోత్సహించిందెవరు?
– డెఫినెట్‌గా రాజుగారే. అయితే ఇలా చెయ్యాలి అని నేను బాగా డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీ, ప్రేక్షకులు మెచ్చుకోవాలి. తీస్తే అలాంటి సినిమా తియ్యాలి. నేను జనరల్‌గా మూడు నెలలో ఏదో సినిమా తీశాం, రిలీజ్ చేశాం అన్నట్టు వుండకూడదు అని ఈసారి గట్టిగా డిసైడ్ అయ్యాను.
ఎడిటింగ్ కూడా మీరే చెయ్యడానికి కారణం?
– ‘లవ్‌లీ’ నేనే చేశాను, ఈ సినిమా కూడా నేనే చేశాను. ఇది నా కథ, నా స్క్రీన్‌ప్లే. ఇందులో మ్యాగ్జిమమ్ నేను రాసిన మాటలే వుంటాయి. క్యారెక్టరైజేషన్, ఫ్రేమింగ్, కెమెరా వర్క్ అన్నీ నా చేతుల్లో నుంచి వెళ్ళినవి. సినిమా ఎలా వుండాలి అనేది నాకు తెలుసు. దానికి అనుగుణంగా నేను ఎడిటింగ్ చేసుకునేటపుడు నాకు సౌకర్యంగా వుంటుంది.
దర్శకుడు, నిర్మాత భారాభర్తల్లాంటివారు అంటుంటారు. మీరు రియల్‌గా భార్యాభర్తలు. ఈ కోఆపరేషన్ ఎలా వుంది?
– సినిమా విషయంలో ఆయనెప్పుడూ కోఆపరేటివ్‌గానే వుంటారు. బడ్జెట్ విషయంలో ఎక్కువైపోతుందని నేనే బాధపడతాను. కానీ, ఆయన మాత్రం సినిమా బాగా రావాలి, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు అంటారు. మరో ప్రొడ్యూసర్ అయితే పాటల కోసం కజక్‌స్తాన్ వెళ్తానంటే ఒప్పుకునేవారు కాదు. ఇక్కడే తియ్యమనేవారు.
స్టార్స్ కాంబినేషన్‌లో మీ సినిమా ఎప్పుడు వుంటుంది? ఆల్రెడీ నాగచైతన్య కూడా మీ బేనర్‌లో సినిమా చేస్తానని చెప్పారు?
– స్టార్ కాంబినేషన్‌లో సినిమా అనేది మన చేతుల్లో లేదు. నాగచైతన్యగారు ‘వైశాఖం’ పాటలు చూసి చాలా బాగున్నాయి, విజువల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా వున్నాయి. మంచి కంటెంట్ వుంటే తప్పకుండా చేస్తానని ‘వైశాఖం’ టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో ఎనౌన్స్ చేశారు. ఏది ఏమైనా అన్నీ కుదరాలి కదా. ‘వైశాఖం’ పెద్ద హిట్ అయ్యాకే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.