నిషేధిత జాబితా నుంచి 3 లక్షల ఎకరాల భూమి తొలగింపు

17
dharani

ధరణి వెబ్ సైట్ డేటా ఎంట్రీలో భాగంగా తలెత్తిన ఆ అవకతవకలను ఒక్కొక్కటిగా సవరిస్తున్నారు. 3 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. కొన్ని కొత్త మాడ్యూల్స్ ను పోర్టల్లో ప్రవేశపెట్టడం ద్వారా 90 శాతం పైగా ఇబ్బందులు పరిష్కారం కానున్నాయి. ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనం కోసం ఏర్పాటైన సబ్ కమిటీ సిఫారసుల నివేదిక సీఎం కేసీఆర్ కు చేరింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపసంఘం రిపోర్ట్ పై చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు.

ధరణి పోర్టల్ను తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే మొట్టమొదటిసారి సకల హంగులు, మెరుగైన సౌకర్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఐతే, అనూహ్యంగా పోర్టల్లో కొన్ని సమస్యలు తలెత్తాయి. సైట్లో ఎంట్రీ చేసిన డేటానే అందుక్కారణం అని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఈ లోపాలను ఎలా సవరించాలనే దానిపై రెవెన్యూ శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. డేటా బేస్ లో సవరణలు చేయాలా లేక పోర్టల్లో కొన్ని టెక్నికల్ మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలా అన్న దానిపై అధ్యయనం చేస్తోంది. అవకతవకలను పోర్టల్లోనే పరిష్కరించే వెసులుబాటు కల్పిస్తే ఆ బాధ్యత ఎవరికప్పజెప్పాలనే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రస్తుతం కలెక్టర్లు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక పోర్టల్లో తలెత్తే సమస్యలను రోజువారిగా పరిష్కరించాలా లేక అంశాలవారిగా సవరణలు చేపట్టాలా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా కమిటీలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సబ్ కమిటీ నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలను అధికారులు ఇప్పటికే పరిష్కరించారు. ఇంకా కొన్ని సమస్యలు నివృత్తికావాల్సి ఉంది.

ఇక డేటా ఎంట్రీ ప్రక్రియలో భాగంగా కొన్ని భూములు అప్పట్లో అనుకోకుండా నిషేధిత జాబితాలోకి చేరాయి. వాటి క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు నిలిచిపోయి భూయజమానులు కొద్దిరోజులు ఇబ్బందిపడ్డారు. అలా సాంకేతిక కారణాల వల్ల ప్రొహిబిటెడ్ లిస్టులోకెక్కిన దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ జాబితా నుంచి తొలగించింది. దీంతో జనం కొంత ఊరట పొందారు. ధరణి పోర్టల్ ద్వారా క్రయవిక్రయాల ప్రక్రియ కూడా కొంత గాడిలో పడ్డట్లైంది. క్యాబినెట్ ఆమోదముద్రతో అమల్లోకి వచ్చే ఉపసంఘం సిఫారసులతో త్వరలోనే మిగిలిన ఆటంకాలు కూడా తొలగనున్నాయి.