హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన కోలీవుడ్ స్టార్ ధనుష్. తమిళ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్…హాలీవుడ్లో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేతో పాటు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి నటులందరూ హాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
తాజాగా ధనుష్.. ‘ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ మంగళవారం విడుదలైంది. తల్లి మృతి చెందాక తండ్రి కోసం వెతుకుతూ దేశాలు తిరిగే పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లు సమాచారం.
రొమైన్ ప్యూర్తొలా రాసిన ‘ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్రోబ్’ పుస్తకం ఆధారంగా దర్శకుడు కెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబై, బ్రుస్సెల్స్ (బెల్జియం), రోమ్ (ఇటలీ), పారిస్ (ఫ్రాన్స్) ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ చేశారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినవారు కావడంతో చాలా వైవిధ్యత కనిపిస్తుందని కెన్ తెలిపారు. ముఖ్యంగా భారత్, యూరప్, హాలీవుడ్‌లను ఏకం చేసే సినిమాగా ఇది నిలుస్తుందని అన్నారు.