హీరో ధనుష్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పంట నష్టాలవల్ల ఆత్మహత్యలు చేసుకున్న, గుండెపోటుతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి గ్రామస్థుల ప్రశంసలందుకున్నారు. ప్రతియేటా ఆయన తన కులదైవమైన కురుప్పస్వామి ఆలయానికి వస్తాడు. ఈ ఆలయం ఆయన పుట్టిపెరిగిన గ్రామం’శంకరాపురం’ లో వుంది.
కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వచ్చిన ఆయన, ఆత్మహత్యలు చేసుకుని పెద్ద దిక్కును పోగొట్టుకున్నవారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయాన్ని అందించారు. ఆదుకోవలసిన రైతుల కుటుంబాల వివరాలను ముందుగానే సిద్ధం చేసుకున్న ధనుష్, ఒక్కో ఇంటికి 50,000 రూపాయలను అందించారు. మరో విడతలో మరికొంత మందికి సాయాన్ని అందించనున్నట్టు చెప్పాడు.
అయితే తను ఆలయానికి వెళ్ళిన సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, గుండె ఆగి మృతి చెందటం వంటి సంఘటనలను చూసి తల్లడిల్లిపోయానని చెప్పారు.
ఆ రైతుల కుటుంబాలకు ఉడుతాభక్తిగా తన వంతు సాయం అందించాలని దర్శకుడు సుబ్రమణ్యశివ కెమెరామెన్ వేల్‌రాజ్ నాయకత్వంలో 11 మంది సభ్యులున్న కమిటీని ఏర్పాటు చేసి రైతన్నలను కోల్పోయిన 250 కుటుంబీకులను ఎంపిక చేశారని, తొలివిడతగా 125 మందికి యాభైవేల చొప్పున ఆర్థిక సహాయం అందించానని ఆయన తెలిపారు.
మరో విడతగా 125 మంది రైతు కుటుంబాలను ఎంపిక చేసి వారికి కూడా తలా రూ. 50 వేలు అందిస్తానని ధనుష్ తెలిపారు. మొత్తానికి సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరో అనిపించుకుంటూ ఆ రైతు కుటుంబాలకు ధనుష్ దేవుడయ్యాడనే చెప్పాలి.