ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శబరిమల… అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిన్నటి నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తులు తరలిరావడంతో కి.మీ మేర క్యూ లైన్ లో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 11 నుంచి 15 గంటల సమయం పడుతోంది.
రెండు నెలల పాటు సాగే దర్శనాల కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. లక్షలాది మంది మండల దీక్షాపరులు ఇరుముడులతో శబరిమల కొండకు పోటెత్తారు.
ఏటా లక్షలాది మంది భక్తులు యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆలయ అధికారులు కఠినమైన రద్దీ నియంత్రణ చర్యలు, డిజిటల్ బుకింగ్ వ్యవస్థలు మరియు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రోజుకు దాదాపు 18 గంటల పాటు తెరిచి ఉంచుతారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) తెలిపిన వివరాల ప్రకారం, రద్దీ విపరీతంగా ఉన్న రోజుల్లో ఆలయాన్ని నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కూడా తెరిచి ఉంచే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో మండల పూజ డిసెంబర్ 27న నిర్వహించబడుతుంది. ఆ తర్వాత మకరవిళక్కు పండుగ జనవరి 14న జరగనుంది.
Also Read:TTD:ఫిబ్రవరి దర్శన కోటా రిలీజ్

