ముంబైలో గణేష్ ఉత్సవాల సందడి పరాకాష్టకు చేరింది. దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా (Lalbaugcha Raja) గణపతిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పర్వదినంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 25న జరగబోయే అనంత చతుర్దశి (గణేష్ నిమజ్జనం) వరకు మొత్తం 12 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ముంబై నగరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.
లాల్బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండలి ఈ ఏడాది 93వ సంవత్సర వేడుకలను పురస్కరించుకుని అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులను ఆకర్షించే ఈ గణపయ్య దర్శనం కోసం సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు భారీగా తరలివస్తుంటారు.
స్వామివారిని దూరంగా ఉండి దర్శించుకుని వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా ‘ముఖ దర్శనం’ లైన్ను అందుబాటులో ఉంచారు.గణపయ్య పాదాలను తాకి, తమ మొక్కులు తీర్చుకోవాలనుకునే భక్తుల కోసం ‘చరణ్ స్పర్శ్’ లైన్ను ఏర్పాటు చేశారు. ఈ లైన్లో స్వామివారి పాద పద్మాలను తాకి ఆశీస్సులు పొందేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
Also Read:పిల్లలలో డెంగ్యూ..అపోహలపై క్లారిటీ
దేశ నలుమూలల నుండి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముంబై పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు భారీ బందోబస్తును, రద్దీ నియంత్రణ చర్యలను చేపట్టారు.

