ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. పిల్లలు ఎక్కువగా జ్వరం మరియు డెంగ్యూ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. సాధారణంగా పిల్లల్లో జ్వరం తగ్గగానే ప్రమాదం తీరిపోయిందని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే జ్వరం తగ్గడం అంటే కోలుకుంటున్నట్లు కాదని, ఆ సమయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లల్లో డెంగ్యూ ప్రారంభ లక్షణాలు సాధారణ వర్షాకాల వైరల్ జ్వరాల మాదిరిగానే ఉంటాయి. తీవ్రమైన జ్వరంతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, వాంతులు, కడుపునొప్పి, దద్దుర్లు, ఆకలి మందగించడం మరియు తీవ్రమైన నీరసం ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణ వైరల్ ఫీవర్‌లాగే కనిపించడం వల్ల తల్లిదండ్రులు మొదట్లో గుర్తించడం కష్టమవుతుంది.
డాక్టర్ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. డెంగ్యూలో జ్వరం తగ్గడం మొదలైనప్పుడే అసలైన ‘క్రిటికల్ ఫేజ్’ (క్లిష్టమైన దశ) ప్రారంభమవుతుంది. జ్వరం తగ్గుతున్న సమయంలో తల్లిదండ్రులు ఈ క్రింది డేంజర్ సిగ్నల్స్‌ను గమనించాలి.
ఆగకుండా వాంతులు కావడం
తీవ్రమైన కడుపునొప్పి
తీవ్రమైన నిద్రమత్తు లేదా విపరీతమైన రెస్ట్‌లెస్‌నెస్ (చిరాకు)
ముక్కు లేదా చిగుళ్ల నుండి రక్తం కారడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చర్మం చల్లగా లేదా తెల్లగా మారిపోవడం
ఈ లక్షణాలు కనిపిస్తే జ్వరం తగ్గినా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితేనే డెంగ్యూ తీవ్రంగా ఉన్నట్లు అని భావించడం పెద్ద అపోహ. వైద్యులు ప్లేట్‌లెట్లతో పాటు పిల్లల శరీరంలో తేమ శాతం , బ్లడ్ సర్క్యులేషన్, మూత్ర విసర్జన , మరియు ఇతర తీవ్రమైన లక్షణాలను చూసి చికిత్స నిరైణిస్తారు. కాబట్టి కేవలం ఒక బ్లడ్ రిపోర్ట్ చూసి భయపడటం కానీ, ప్రశాంతంగా ఉండటం కానీ చేయకూడదు.
డెంగ్యూ అనుమానం ఉంటే పిల్లలకు ఆస్ప్రిన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఇవి రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. కేవలం పారాసిటమాల్ మాత్రమే వైద్యుల సలహాతో వాడాలి. ఓఆర్‌ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు వంటి ద్రవాహారాన్ని పుష్కలంగా అందించాలి.
Also Read:తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన
డెంగ్యూ వ్యాప్తి చెందించే ఈడెస్ (Aedes) దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. కాబట్టి కేవలం రాత్రిపూటే కాకుండా పగటిపూట కూడా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూలర్లు, పూల కుండీలు, బకెట్లు, పాత టైర్లలో మంచి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.ప్రతి వారంలో కనీసం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయాలి.

