అనాథ పిల్ల‌ల‌తో రాక్‌స్టార్ బర్త్‌డే వేడుకలు..

72

రెండు ద‌శాబ్దాలుగా ద‌క్షిణాది, బాలీవుడ్ చిత్రాల‌కు సంగీతాన్ని అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈరోజు (ఆగ‌స్ట్‌2) పుట్టిన‌రోజు జరుపుకున్నారు. ఈపుట్టిన రోజును ఆయన విజయవాడ సమీపంలోని గన్నవరం డ్యాడీస్‌ హోమ్ అనాథాశ్ర‌మంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ అనాథ పిల్ల‌ల‌తో కేక్ క‌ట్ చేసి బర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌, గ‌న్న‌వ‌రంలోని అంద‌మైన ప్ర‌దేశానికి వ‌చ్చాను. త‌ల్లిదండ్రుల ప్రేమ‌కు నోచుకుని వంద‌లాది చిన్నారుల యోగ‌క్షేమాలు చూసుకునే డాడీస్ హోం ను సంద‌ర్శించ‌డం చాలా ఆనందంగా ఉంది. వంద‌లాది చిన్నారుల‌కు శ్ర‌ద్ధ‌తో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న సేవ నా మ‌న‌సును తాకింది. గతంలో సర్‌ప్రైజ్‌ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటినుంచి వాళ్లతో కనెక్ట్‌ అయిపోయాను.

నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడున్న క‌ఠిన ప‌రిస్థితుల్లో ఇలాంటి వారికి అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం మ‌న‌కెంతో ఉంది. ఎవ‌రైనా డ్యాడీస్ హోం వారికి సాయం చేయాల‌నుకుంటే.. 9948661346 నెంబ‌ర్‌కు కాల్ చేసి మీ వంతు సాయాన్ని అందించండి’’ అని దేవిశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్ల‌ల నిర్వ‌హ‌ణ‌కు అయ్యే నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను రాక్‌స్టార్ అందించారు.