రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరినాటే యంత్రాలపై ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి పరిశోధనా విభంగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఫిల్డ్ డిమాన్‌స్ట్రేషన్‌ను నిర్వహించింది. వరిలో మిషన్లతో నాట్లు వేసే పద్దతిని రైతులలో ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో వరినాట్లు వేసే యంత్రాలను ఇక్కడ వివిధ కంపెనీలు ప్రదర్శించాయి. ప్రత్యేకంగా పెంచిన నారుతో యంత్రాల ద్వారా నాట్లు వేసే పద్దతులను, వరి పనుతీరును ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
అయితే కూలీల కొరత కారణంగా వరిలో యంత్రీకరణను ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వివిధ కంపెనీలు తయారు చేసిన వరినాట్లు వేసే యంత్రల పనితీరును నిపుణుల కమిటీతో పరిశీలన జరిపిస్తోంది. కూలీలతో నాట్లు వేయడానికి అయ్యే ఖర్చును ,యంత్రాలతో నాట్లు వేయడం వల్ల సమయం ఆదాకావడం, సకాలంలో నాట్లు వేయడం, ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. విత్తనాలు కూడా తక్కువ అవసరం అవుతుందని భావిస్తున్నారు.
వరి పంటకోసే యంత్రాలు రైతులలో ప్రాచుర్యం పొందడం వల్ల నాట్లు వేయడం, కలుపు తీయడంలోనూ యంత్రలను ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్, విస్తరణ సంచాలకులు డాక్టర్ డి. రాజిరెడ్డి తోపాటు వరి విభాగం శాస్త్రవేత్తలు పాల్గొని యంత్రాల పనితీరును పరిశీలించారు. అలాగే విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రల ఏడీఆర్‌లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.