నోట్ల రద్దుతో నెలరోజుల నుంచి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కొత్తనోటు చిల్లర లేక, పాతనోటు మార్పిడి చేసుకోలేక సామాన్యుడు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు. పార్లమెంట్ సమావేశాల్లో నోట్ల రద్దు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్షలు నోట్ల మీదే తప్ప వేరే దానిమీద చర్చలు జరగనివ్వడంలేదు. రోజురోజుకు బ్యాంకులు,ఏటీఎంల ముందు క్యూలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. కొన్ని ఏటీఎంలలో డబ్బులు లేక జనాలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. మొదట్లో ఇచ్చినంత నగదును కూడా బ్యాంకులు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని బ్యాంకులు మధ్యహ్నాం వరకే నో క్యాష్ బోర్డు పెట్టేస్తున్నాయి. సాయంత్రం వరకు నగదు ఇవ్వాల్సిన బ్యాంక్‌లు నగదు లేని కారణంగా లంచ్‌టైం వరకే క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఏటీఎంల ముందు ఎప్పుడు చూసిన ఔట్ ఆఫ్ క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఒక్కటే మార్గమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. 5వందల నోట్లను సరిపడే అన్ని అందుబాటులోకి తెస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదని తేల్చి చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 10లక్షల కోట్లు దేశంలో చలామణీలోకి రావాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజ్‌నీష్ కుమార్ తెలిపారు. 3 నుంచి 4లక్షల కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
5వందల నోట్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదని రజనీష్ తెలిపారు. ఇప్పుడు సమస్యంతా 2వేలు, వంద నోట్ల మధ్యే ఉందని, 2వేలకు సరిపడ చిల్లర ఇవ్వడానికి తగినన్ని వంద నోట్లు ఉండటం లేదని ఆయన స్పష్టం చేశారు. 5వందల నోట్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకూ 49వేల ఎస్‌బీఐ ఏటీఎంలకు గానూ 43వేల ఏటీఎంల్లో కొత్త నోట్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేశామని ఆయన తెలిపారు. రోజుకు 17వేల నుంచి 19వేల కోట్ల రూపాయలను ఎస్‌బీఐ ఏటీఎంల్లో నింపుతున్నామని రజనీష్ కుమార్ తెలిపారు.