ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU) తమ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) హిస్టరీ సిలబస్‌ను సవరించింది. ఇందులో భాగంగా సెమిస్టర్ III నుండి ‘ఢిల్లీ సుల్తానేట్’ పాఠ్యాంశంతో పాటు చాన్నాళ్లుగా కొనసాగుతున్న పలు ఇతర కోర్సులను కూడా తొలగించింది. కొత్తగా నోటిఫై చేసిన పీజీ హిస్టరీ సిలబస్ నుండి “ది ఢిల్లీ సుల్తానేట్..స్ట్రక్చర్స్ ఆఫ్ అథారిటీ ఇన్ మెడీవల్ నార్త్ ఇండియా (13-14వ శతాబ్దాలు)” అనే ప్రత్యేక పేపర్‌ను తొలగించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ పేపర్‌ను ఇంతకుముందు సెమిస్టర్ IIIలో బోధించేవారు.
ఈ కోర్సు మధ్యయుగ రాజ్య ఏర్పాటు, రాజకీయ అధికార నిర్మాణాలు మరియు మధ్యయుగ ఉత్తర భారతదేశంలో అధికారం వినియోగించిన తీరుపై ప్రధానంగా దృష్టి సారించేది. అలాగే 13, 14వ శతాబ్దాల నాటి రాజకీయ, మతపరమైన మరియు సాంస్కృతిక పరిణామాలను కూడా ఇది విశ్లేషించేది.భారతీయ చరిత్రలో అత్యంత కీలకమైన కాలానికి చెందినది కావడం, దశాబ్దాలుగా మధ్యయుగ భారతదేశ చరిత్ర కోర్సుల్లో ముఖ్యమైన భాగంగా ఉండటంతో ఈ పేపర్ తొలగింపు చర్చనీయాంశంగా మారింది.
పీజీ స్థాయిలో అందించే ‘ఢిల్లీ సుల్తానేట్’ పేపర్ అనేది మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక పరిశోధనాత్మక అధ్యయనం. డిగ్రీ (UG) స్థాయిలో బోధించే ఢిల్లీ సుల్తానేట్ పేపర్‌తో దీన్ని పోల్చకూడదని విశ్వవిద్యాలయ చరిత్ర విభాగానికి చెందిన ఒక ఆచార్యుడు పేర్కొన్నారు. డిగ్రీ కోర్సు అనేది విస్తృతమైన విశ్లేషణను అందిస్తే, పీజీ స్థాయి పేపర్ మాత్రం మరింత లోతైన, పరిశోధనాత్మక దృష్టితో కూడి ఉంటుంది.
ఇదే తరహాలో సెమిస్టర్ III సిలబస్ నుండి “హిస్టరీ ఆఫ్ నార్త్ ఇండియా (సా.శ. 1400-1550)” అనే మరొక పీజీ పేపర్‌ను కూడా తొలగించారు. ఈ మార్పులు కేవలం మధ్యయుగ చరిత్రకే పరిమితం కాలేదు. ప్రాచీన చరిత్రకు చెందిన పలు ముఖ్యమైన పేపర్లు కూడా సెమిస్టర్ III తుది సిలబస్‌లో కనిపించడం లేదు. వాటిలో:
“జెండర్ అండ్ విమెన్ ఇన్ ఎర్లీ ఇండియా: 1500 BCE టూ 1000 CE”
“పొలిటికల్ ప్రాసెస్సెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిటీస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా”
“రిలిజియన్ అండ్ సొసైటీ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్”
Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!
ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ విభాగం మొత్తం 38 ‘డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్’ (DSE) పేపర్లను ప్రతిపాదించగా, తుది నోటిఫై చేసిన సెమిస్టర్ III సిలబస్‌లో కేవలం 16 పేపర్లకు మాత్రమే చోటు దక్కింది. దీంతో ప్రతిపాదించిన 22 DSE పేపర్లు తుది నోటిఫికేషన్ పరిధికి వెలుపలే ఉండిపోయాయి. ప్రతిపాదించిన అనేక కోర్సులు విశ్వవిద్యాలయ రికార్డుల్లో ఇప్పటికీ “చర్చలో ఉన్నాయి” లేదా “చర్చించబడలేదు” అని నమోదై ఉన్నాయి. ఆగస్టు 7న ఈ తుది సిలబస్ నోటిఫికేషన్ విడుదలయింది.

