కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారిద్దరి వయసుల గురించి ప్రస్తావిస్తూ.. అయితే మీరు జనరేషన్ జెడ్ (Gen Z) కాదు. అసలు Gen Z అంటే ఏమిటి? అని వ్యాఖ్యానించింది. 1997 తర్వాత జన్మించిన వారిని సాధారణంగా Gen Zగా పరిగణిస్తారని న్యాయస్థానానికి వివరించగా అయితే మీరు Gen Z కాదు” అని మరోసారి పేర్కొంది.
సౌరవ్ దాస్ వయసు 27 ఏళ్లు కాగా, ఆశుతోష్ రంకా వయసు 32 ఏళ్లని వారి తరఫు న్యాయవాది అభిక్ చిమ్ని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించి వీరిద్దరి కస్టడీని పొడిగించడంపై పిటిషన్ దాఖలైంది.
ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అక్టోబర్ 19న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగించారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని, తమను వెంటనే విడుదల చేయాలని, కస్టడీ పొడిగింపుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్.. సంబంధిత ఉత్తర్వులపై రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార మార్గాన్ని ముందుగా వినియోగించుకోవాల్సి ఉంటుందా? అనే అంశాన్ని పరిశీలించారు.
మీరు రెండోసారి ఈ ఘటనకు పాల్పడ్డారు. గతంలో శాంతిని కాపాడుతామని ఇచ్చిన బాండ్‌ను ఉల్లంఘించిన వ్యక్తి మీరు. మీకు సరైన పరిష్కార మార్గం రివిజన్ పిటిషనే కావచ్చు అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా తరఫు న్యాయవాది అభిక్ చిమ్ని.. కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు చట్టబద్ధంగా చెల్లవని వాదించారు. అయితే, సంబంధిత ఉత్తర్వులపై రివిజన్ దాఖలు చేయవచ్చా? ముందుగా ఆ మార్గాన్ని ఎందుకు అనుసరించకూడదు? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
Also Read:ఎమ్మెల్యే వివేకా బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్
అదే రోజు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట కూడా విచారణ జరగాల్సి ఉండటంతో, ముందుగా అక్కడి పరిణామాలను వేచి చూడాలని న్యాయమూర్తి సూచించారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుని, అనంతరం అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈరోజే మీరు విడుదలైతే పరిస్థితి ఏమిటి? ఇది తుది విచారణ కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం కోరాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది

