బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ..తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘RAPO23’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో రితేష్ పాల్గొన్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్లోకి అరంగేట్రం చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రితేష్ దేశ్‌ముఖ్.. ‘RAPO23’లో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కామెడీ, కుటుంబ కథా చిత్రాలతో పాటు థ్రిల్లర్ సినిమాల్లోనూ తన నటనతో మెప్పించిన ఆయన.. ఈ సినిమాలో సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథ, తన పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
రామ్ పోతినేని ఈ సినిమాతో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు. ‘RAPO23’ను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, నియో-నోయర్ శైలిలో తెరకెక్కిస్తున్నారు. కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read:ఎమ్మెల్యే వివేకా బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్
ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. రామ్-రితేష్‌ల కలయిక, విభిన్నమైన కథాంశం ఈ ప్రాజెక్టుపై అంచనాలను పెంచుతున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో రితేష్ పాల్గొన్న సందర్భంగా చిత్ర బృందం తెరవెనుక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో రామ్ పోతినేని ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు తిరునావుక్కరసు (తిర్రు) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తుండగా, పీటర్ హెయిన్, విక్రమ్ మో, కెవిన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

