కరోనా సెకండ్ వేవ్‌తో ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రోజుకు వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతుండగా ఆప్ సర్కార్ పటిష్ట చర్యలు చేపడుతోంది.
తాజాగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 50శాతం మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించింది. రెవెన్యూశాఖ పంపిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని విపత్తు నిర్వహణ అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రైవేటు కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్‌ఫ్రం హోం పాలసీని అనుసరించాలని సూచించింది.
ప్రభుత్వ కార్యాలయాల్లోని గ్రేడ్ వన్, తత్సమాన స్థాయి అధికారులందరూ నూటికి నూరు శాతం కార్యాలయాలకు హాజరుకావాలని తెలిపారు. మిగిలిన సిబ్బందిలో 50 శాతం మంది అవసరాన్నిబట్టి కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్, కార్పొరేషన్లు, జైళ్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో గ్రేడ్ వన్, తత్సమాన స్థాయి అధికారులు వందకు వందశాతం పని చేయాలని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.