రెండు రోజుల క్రితం చోరీకి గురైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు దొరికింది. ఇవాళ ఉదయం ఘజియాబాద్‌లో ఆ కారును గుర్తించారు. ఢిల్లీ సచివాలయం నుంచి కేజ్రీకి చెందిన బ్లూ వ్యాగనార్ కారు చోరీకి గురైంది. ఆ కారును ముద్దుగా ఆప్ మొబైల్ అని పిలుస్తారు. సీఎం కారు చోరీకి గురికావడంతో అదో సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి.
కారు ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన.. తన లేఖలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నా కారు ఎత్తుకెళ్లడం పెద్ద విషయం కాదు.. కానీ అది ఢిల్లీ సచివాలయం నుంచి దొంగలించడమంటే.. నగరంలో లా అండ్ ఆర్డర్ లేనట్లే అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు రెండు రోజుల్లోనే కారు ఆచూకీని కనిపెట్టారు.
2013లో కుందర్ శర్మ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆ కారును కేజ్రీవాల్‌కు విరాళమిచ్చారు. అయితే ఈ కారును ఎవరు దొంగిలించారు అనే విషయం ఇప్పటికీ తెలియదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.