ఢిల్లీలోని ఇజ్రాయల్ దౌత్య కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ బాంబు పేలుడు ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. శనివారం ఉదయం నుండి చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సరైన ఆధారాలు లభించలేదు. గడిచిన రెండు రోజుల్లో అబ్దుల్ కలాం మార్గ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణికులను పికప్, డ్రాప్ చేసిన క్యాబ్ డ్రైవర్లను పోలీసులు విచారించారు.
పేలుడు జరగక ముందు రెండు గంటలు, జరిగిన తర్వాత గంట సీసీ కెమెరాల డేటాను పోలీసులు సేకరించారు.ఆ సమయంలో రాకపోకలు సాగించిన క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించారు పోలీసులు.పేలుడు సమయంలో ఇద్దరు అనుమానాస్పదంగా క్యాబ్ నుండి దిగడం సిసిటివి కెమెరాలో గమనించారు. ఆయా కోణాల్లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు జరుతున్నారు. కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చాక దీనిపై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.