నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలకోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు రిలీఫ్‌నిచ్చింది. నీట్ ఫలితాలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నీట్ 2017 ఫలితాలను విడుదల చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇవాళ (జూన్ 12) తేల్చి చెప్పింది.
ఇప్పటికే నీట్ 2017 ఫలితాలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు మే 24న స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ చేపట్టిన భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది. దీంతో రెండు వారాల్లోగా నీట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది.
దీంతో నీట్ ఫలితాలు జూన్ 26 కంటే ముందే రిజల్ట్స్ వెలువడనున్నాయి. అయితే ఇతర లాంగ్వేజ్ ప్రశ్నాపత్రాలతో పోల్చినప్పుడు.. ఇంగ్లిష్, హిందీ భాషలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల్లో కొన్ని భిన్నమైన ప్రశ్నలను ఇచ్చారని, దీని వల్ల అభ్యర్థులపై ప్రభావం పడుతుందని కొంత మంది మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు అది కావాలని చేసిందేనని సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది. ఇక ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నీట్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలంటూ తాజాగా తీర్పు చెప్పింది. అంతేకాకుండా నీట్ – 2017 అంశంపై తప్పనిసరి అయితే తప్ప.. ఎలాంటి పిటిషన్లను స్వీకరించొద్దని అన్ని హై కోర్టులకు స్పష్టం చేసింది.