గొర్రెకుంట బావి కేసు..నిందితుడికి ఉరిశిక్ష

327
gorrekunta bavi case
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బావిలో తొమ్మిది హత్యల కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ను దోషిగా తేల్చింది అదనపు జిల్లా కోర్టు. నిందితుడు సంజయ్‌కు ఉరిశిక్షను ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. తర్వాత పని నిమిత్తం గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంకు వచ్చి ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. వీరితో మక్సూద్ భార్య అక్క కూతురు రఫికా కూడా నివాసం ఉంటుంది.

వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్నపై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా పనిచేస్తున్నారు. వీరి కుటుంబంతో బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్‌ యాదవ్‌కు పరిచయం ఏర్పడింది. ఇదే క్రమంలో మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజయ్ దగ్గరయ్యాడు.

ఆమెతో సహజీవనం చేశాడు. తర్వాత రఫీకా కూతురుపై కన్నేశాడు సంజయ్‌. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా తెలపడంతో ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్న సంజయ్‌…పెళ్లి విషయం మాట్లాడేందుకు పశ్చిమ బెంగాల్‌ వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు ఆమె అపస్మారక స్ధితిలోకి వెళ్లాక చంపేసి రైలు నుండి కిందకు తోసేశాడు.

రఫికా గురించి మక్సూద్ భార్య నిలదీయడంతో వారి కుటుంబాన్ని కూడా హతామర్చాలనుకున్నారు. కొన్నిరోజుల పాటు వీరి పనిచేస్తున్న గోదాం ప్రాంతాన్ని పరిశీలించాడు. తర్వాత మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజు అందరికీ చావు ముహుర్తం పెట్టాడు సంజయ్. ఓ మెడికల్‌ షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. బర్తడే పార్టీకి వెళ్లి మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోనె సంచుల్లో వేసి గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లిపోయాడు. అలా ఒక హత్యను కప్పిపుచ్చోవడానికి నిందితుడు తొమ్మిది హత్యలు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు.

- Advertisement -