హైదరాబాద్ చందానగర్‌లో సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు డీసీపీ వెంకటేశ్వర్లు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో కుటుంబ సభ్యులు మినహా బయటి వ్యక్తుల ప్రమేయం లేదన్నారు.
గురువారం యువతి తండ్రి లక్ష్మారెడ్డి ఆమె మేనమామ యుగంధర్‌రెడ్డితోపాటు కుటుంబీకులు మూడు కార్లలో వచ్చి మాట్లాడతామని చెప్పి హేమంత్ దంపతులను చందానగర్ వైపునకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చి మార్గమధ్యలో గోపన్‌పల్లి వద్ద దంపతులిద్దరూ కారు నుంచి దూకి పారిపోయేందుకు యత్నించారు.
అయితే మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో హేమంత్‌ను వెంబడించిన యుగంధర్‌రెడ్డి దారుణంగా హతమార్చారని తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హేమంత్ ఆచూకీ గుర్తించేందుకు యత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో గుర్తించలేకపోయామని డీసీపీ చెప్పారు. ఈ కేసులో ఎక్కడా పోలీసుల వైఫల్యం లేదన్నారు డీసీపీ. నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డితోపాటు స్పందన, స్వప్న, రజిత, అర్చనలతోపాటు యువతి తల్లిదండ్రులే హత్య చేసినట్లు పేర్కొన్నారు.