డీసీసీబీ సాధించిన ప్రగతి బాగుంది..

52

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాథమిక రైతు సహకార సంఘాల చైర్మన్ల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హన్మకొండ అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డిప్యూటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న PACS చైర్మన్లు, డైరెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పని తీరు అన్ని రంగాల్లో బాగా మెరుగు పడింది. కొత్త శాఖల ఏర్పాటు, డిపాజిట్ల సేకరణ, రుణాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాల ద్వారా, బ్యాంక్ బహుళార్థసాధకంగా తీర్చిదిద్ధబడి, మంచి లాభాలు ఆర్జించే బాటలో పడిందన్నారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలతో పాటు, మహిళా సంఘాలకు కూడా రుణాలు అందచేస్తుండటం అభినందనీయం.గోల్డ్ లోన్లు, విద్యా రుణాలు, మార్ట్ గేజ్ రుణాలు, వ్యక్తిగత, సామూహిక, చిరు వ్యాపారుల, వాహన, పని ముట్ల, శీతల గిడ్డంగులు, ఇలా అనేక రుణాలతో పాటు రైతు శిక్షణను కూడా చేపట్టింది.

గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఉమ్మడి పాలనలో, నిర్లక్ష్యానికి గురైన బ్యాంక్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ సహకారంతో పని చేస్తున్న పాలక వర్గాన్ని అభినందిస్తున్నాను. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 1917లో స్థాపించబడి 104 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతాంగానికి సేవలందిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 డీసీసీబీ బ్యాంకు బ్రాంచీలు, వరంగల్ జిల్లాలో గల 91 ప్రాధమిక సహకార సంఘాలకు గాను, 70 ప్రాధమిక సహకార సంఘాల ద్వారా రైతాంగానికి సేవలందిస్తున్నది. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మరో 8 కొత్త శాఖలను కేసముద్రం, మడికొండ, ధర్మసాగర్, పాలకుర్తి, కొడకండ్ల, పర్వతగిరి, చిట్యాల, ఏటూరునాగారంలలో త్వరలో ప్రారంభించ నుండటం మంచి పరిణామం అన్నారు మంత్రి.దీంతో రైతులకు మరింత మంచి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ప్రస్తుత పాలకవర్గం మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన 29.02.2020 నాడు బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది. ఏడాదిలో వరంగల్ డీసీసీబీ సాధించిన ప్రగతి బాగుంది. భూమి లేని మహబూబాబాద్ వంటి సహకార సంఘాలకు 2ఎకరాల భూమి సేకరించారు. అనేక రకాలుగా సేవలను విస్తరించి డి.సి.సి.బి నికర లాభాన్ని 4.92 నుంచి 6.99 కు పెంచారు. రికవరీ శాతం 89.61 గా ఉంది. నిరర్ధక ఆస్తులను 7.55 శాతం నుండి 2.55 శాతానికి తగ్గించారు. డిపాజిట్లను 50 కోట్లు పెంచారు. అంత మేరకు ఋణాలను పెంచారు.బ్యాంక్ టర్న్ ఓవర్ ను 869 కోట్ల నుండి 1175 కోట్ల కు పెంచారు. సహకార బ్యాంకు ద్వారా 100 కోట్ల వరకు సంఘాలకు బ్యాంకు లింకేజి ఇవ్వటానికి ప్రణాళిక సిద్దం చేశారు. డీసీసీబీ ఇంకా అభివృద్ధి సాధించాలని, ఉత్తమంగా రైతులకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను.
పీఏసీఎస్‌ లను సర్వాంగ సుందరంగా, పచ్చదనం, పరిశుభ్రతగా తీర్చిదిద్దిండి అని మంత్రి సూచించారు. కాగా, డీసీసీబీ ప్రస్తుత ప్రగతి, వచ్చే ఏడాది చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు సభకు వివరించారు.