ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఓపెనర్ ధావన్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదుచేసి ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు తన ఒంటరిపోరాటం కొనసాగించాడు. చివరి ఓవర్‌లో 18 పరుగులు కావాల్సి ఉండగా అక్షర్ పటేల్ రెండు సిక్స్‌లతో రాణించడంతో ఢిల్లీ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో చేరింది. అక్షర్ పటేల్ 5 బంతుల్లో 21 పరుగులు చేయగా ధావన్ 58 బంతుల్లో 101,14 ఫోర్లు ,ఒక సిక్స్‌తో రాణించాడు. దీంతో 19.5 ఓవర్లలో 185 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. చెన్నై బౌలర్ల ధాటికి 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యువ ఓపెనర్ పృథ్వీ షా(0) ,రహానె(8) ఎక్కువసేపు నిలువలేదు. తర్వాత వచ్చిన అయ్యర్ 23,స్టయినిస్ 24 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు సాధించింది. డుప్లెసిస్ (58: 47 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) , షేన్ వాట్సన్(36: 28 బంతుల్లో 6ఫోర్లు) ,చివర్లో అంబటి రాయుడు(45 నాటౌట్: 25 బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లు ), రవీంద్ర జడేజా(33 నాటౌట్: 13 బంతుల్లో 4సిక్సర్లు ) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, తుషార్ దేశ్‌పాండే చెరో వికెట్ పడగొట్టారు.