విచారణకు వచ్చేది ఏంటి..మంత్రి డుమ్మా!

0
- Advertisement -

ఢిల్లీ హోటల్‌లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన వాగ్వాదం, ఘర్షణ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీపీసీసీ విచారణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావులను గురువారం గాంధీ భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ గైర్హాజరయ్యారు. విచారణకు రావాల్సిన అవసరం ఏముందన్న ధోరణితో ఆయన హాజరుకాకుండా దూరంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాత్రం మధ్యాహ్నం విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను తెప్పించినట్లు ఆయన వెల్లడించారు. విచారణ సందర్భంగా ఆ ఫుటేజ్‌ను ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ విచారణ కమిటీ ముందు ఉంచుతానని పేర్కొన్నారు.

Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర

ఇటీవల ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లడంతో టీపీసీసీ విచారణకు ఆదేశించింది. ఇరువురి నుంచి వివరణ తీసుకుని వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. అయితే మంత్రి విచారణకు గైర్హాజరు కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సమర్పించనున్న సీసీటీవీ ఫుటేజ్‌లో ఏం బయటపడుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

- Advertisement -