ఉద్యమంగా దళిత బంధు: సీఎం కేసీఆర్‌

225
- Advertisement -

మనదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం. దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు.దళితజాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు, ఆ వర్గం పై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటే అలుముకొని ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం అంగీకరించి తీరాలి అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈరోజు స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. దేహంలో కొంతభాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్పకూలుతుంది. అదే విధంగా దేశంలో ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని అందరూ గ్రహించాలి. ప్రజాస్వామ్యమంటే సమానవత్వమే. వీలయినంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి, దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం కావాలి అని అన్న భారత రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలని సీఎం కోరారు.

తెలంగాణా ఏర్పడిన నాటినుండీ అణగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులువేసింది. దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించింది. 2014 తెలంగాణా ఏర్పడేనాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య కేవలం 134 మాత్రమే. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా 104 స్కూళ్ళు ఏర్పాటు చేసింది. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 238కి పెరిగింది. ఈ ఏడెండ్లలో ఎస్, సి మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

దళిత విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా 20 లక్షల రూపాయల అత్యధిక మొత్తాన్ని స్కాలర్ షిప్‌గా అందిస్తున్న ఒకేఒక ప్రభుత్వం తెలంగాణాప్రభుత్వం. దళితజాతిని ప్రత్యెక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజానికి ప్రధాన బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్శ్యా, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీద నిలవాలి. దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అణగారిన దళితజనం ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు ఉద్యమం అని రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాను అని సీఎం చెప్పారు.

దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. మహాత్మా జ్యోతీరావు ఫూలే, భారత రత్న బి.ఆర్. అంబేద్కర్ మహాశయుల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు, దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం బడ్జెట్ లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్నిమన రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా అమలుచేస్తుంది. రాష్ట్రం లోని మిగతా నియోజక వర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు. అందుకే దళితబంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.దళితబంధు ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమచేస్తుంది. బ్యాంకులతో సంబందం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. దీంతో లబ్దిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు. ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకొనే పూర్తి స్వేచ్ఛ లభ్దిదారునికే ఉంటుందన్నారు సీఎం.

తనకు ఏ రంగంలోనైతే అనుకూలత, అనుభవం, ప్రావీణ్యం, ఉందని లబ్దిదారుడు భావిస్తాడో ఆ రంగంలోనే తన జీవనోపాధిని ఎంచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. లబ్దిదారులెవరైనా తనకు తాను ఉపాధిని ఎంచుకోవటంలో అస్పష్టతకు లోనైతే, ప్రభుత్వం యొక్క సూచనలు కోరితే, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది. కొందరు లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి, పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్‌ను పెట్టుకొనే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కావటం లేదు. దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, హాస్పిటళ్ళకు, హాస్టళ్ళకు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్, బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్‌ను అమల్లోకి తేనుందని సీఎం వివరించారు.

రక్షణ కవచంగా దళితరక్షణ నిధి..
దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆకుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆపద సమయంలో దళితబంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకోసం దేశం లోనే ప్రప్రథమంగా దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్దిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో 10 వేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితులను ఏర్పాటు చేస్తుంది. ఈ సమితుల నేతృత్శంలో నిధిని నిర్వహించటం జరుగుతుంది. దళితబంధు అమలు, దళితరక్షణ నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు కీలక భూమిక పోషిస్తారని తెలిపారు.

గతంలో ప్రభుత్వాలు దళితులకు ఏదైనా సహాయం అందించిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పర్యవేక్షణ సరిగా ఉండేది కాదు. దళిత బంధు ద్వారా లబ్దిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టమైన విధానం రూపొందించింది. దళిత బంధు ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది . అందులో ప్రత్యేక చిప్ ను అమర్చి, ఆచిప్ సహాయంతో ఫలితాలను పర్యవేక్షిస్తుంది దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి. రేషన్ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలు అన్నీ యథాతధంగా ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.

రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని, తద్వారా దేశంలో దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇంతకాలం వివక్షకు గురైన దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళు నెరవేరుస్తుందని హామీ ఇస్తున్నాను. అవకాశాలు కల్పిస్తే దళితులూ సమాజంలో ఎవ్వరికీ తీసిపోరని,తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని, ప్రపంచానికి తెలియజేస్తుంది. తెలంగాణ దళిత బంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా,ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నది. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి, ఎంతో మంది దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో తెలంగాణా దళిత బంధుని గురించి చక్కని చర్చ జరుగుతున్నందుకు ప్రభుత్వం ఎంతో సంతోషిస్తున్నది. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణా దళితబంధు ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నది. రాష్ట్రంలో ప్రతి వర్గానికీ న్యాయం చేయాలనే విశాల దృక్పథంతో, ప్రణాళికాబద్దంగా తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. అయినా, మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది.అదే సందర్భంలో రాష్ట్ర ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలకు తోడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి మరోమారు భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -