ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది మురసు తుఫాన్. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలుల వేగం అప్పుడప్పుడు 120 కిలోమీటర్లకు చేరుకుంటోంది.
నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మురాసు తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్‌కు సంబంధించిన మేఘాల ముందు భాగం ఇప్పటికే తీరంలోకి ప్రవేశించిందని, ప్రధాన మేఘాల ప్రాంతం కూడా తీరానికి అత్యంత సమీపంలో ఉందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
తెల్లవారుజామున 1.30 గంటల సమయానికి తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఒంగోలుకు ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు, కావలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
నెల్లూరు నుంచి నర్సాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. తీర ప్రాంతాల్లో ఉదయం వరకు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గాలుల వేగం గరిష్ఠంగా 120 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపింది.
Also Read:రాహుల్ కోసమే RR ట్యాక్స్:అమిత్ షా
దక్షిణ కోస్తాలో రానున్న 12 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రపు ఆటుపోట్ల సాధారణ స్థాయికి అదనంగా 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని దీంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అలల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

