బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. మ్యాచ్ సందర్భంగా స్టేడియం డీజే ప్లే చేసిన ‘దోశ, ఇడ్లీ’ ట్రాక్ తమను కించపరిచేలా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.
ఏప్రిల్ 5న జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు డీజే ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అనే పాటను ప్లే చేశారు. సాధారణంగా దక్షిణాది వ్యక్తులపై వచ్చే ‘మీమ్స్’ (Memes) మరియు స్టీరియోటైప్స్ (మూస పద్ధతులు) కోసం ఈ పాటను వాడుతుంటారు. తమ ఇన్నింగ్స్ ముందు ఇలాంటి పాటను ప్లే చేయడం ఏమాత్రం గౌరవప్రదంగా లేదని సీఎస్‌కే భావిస్తోంది.
ఈ ఫిర్యాదుపై సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. “సాధారణంగా స్టేడియం డీజేలు హోమ్ టీమ్‌కు మద్దతుగా ఉంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి వేరుగా ఉంది. మా ఆటగాళ్లను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణ జరపాలని మేము బీసీసీఐకి లేఖ రాశాం” అని తెలిపారు.ముఖ్యంగా సీఎస్‌కే ఆటగాళ్లు అవుట్ అయిన సమయంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా డీజే చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని సీఎస్‌కే అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా
నిజానికి ఈ ‘దోశ, ఇడ్లీ’ పాట వివాదం గత ఏడాది నుంచే నడుస్తోంది. అప్పట్లో ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఈ పాట పాడుతున్న వీడియోను ఆర్సీబీ పోస్ట్ చేయడంతో సీఎస్‌కే అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేశారు. తాజాగా స్టేడియంలోనే ఈ పాటను ప్లే చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ ఫిర్యాదును స్వీకరించింది…మాకు సీఎస్‌కే నుంచి ఫిర్యాదు అందింది, ప్రస్తుతం మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం అని ఒక ఉన్నత స్థాయి ఐపీఎల్ అధికారి ధృవీకరించారు.

