లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న ఆ పార్టీకి కీలక నేతలు గట్టి షాక్ ఇస్తున్నారు. పార్టీలో ఇమడలేం అంటూ గుడ్ బై చెబుతున్నారు. ఓ వైపు ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు కాంగ్రెస్ తో ఎడమొఖం పెడమొఖంగా ఉంటుండగా మరోవైపు సొంత పార్టీలోని నేతలు కూడా హస్తం పార్టీకి పక్కలో బల్లెంలా తయారయ్యారు. కీలక సమయాల్లో పార్టీకి గుడ్ బై చెప్తూ షాక్ ఇస్తున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మిళింద్ దియోరా కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన శివసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగేళ్లలో దాదాపు 11 మంది కీలక నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు..
కపిల్ సిబల్, గులాంనబీ ఆజాద్, జ్యోతిరాధిత్య సింధియా, హర్ధిక్ పటేల్, అశ్వినీ కుమార్, సునీల్ జకార్, జీతిన్ ప్రసాద్, అళ్పెష్ ఠాకూర్, అనిల్ ఆంటోని, వంటి వారు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. లోక్ సభ ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల సమయం ఉండడంతో ఈ కొద్ది సమయంలో మరికొంత మంది హస్తం నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో హస్తం పార్టీ అధిష్టానంలో అంతర్గతంగా ఆందోళన మొదలైనట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొంతమంది నేతలు విభేదిస్తున్నారు. దీంతో అధికారమే లక్ష్యంగా ఉన్న హస్తం పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. మరి పార్టీలోని వలసలను అపెందుకు అధిష్టానం కొత్త ప్రణాళికలు వేస్తుందా ? లేదా కొంతమంది విషయంలో పార్టీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారా అనేది విషయాలు ఆసక్తికరంగా మారాయి. మరి ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:పిక్ టాక్ : హాట్ షూట్స్ తో మెస్మరైజింగ్ ఫోజులు