బండి మతోన్మాదంతో విర్రవీగకు..!

320
bandi
- Advertisement -

గత కొద్ది రోజులుగా తెలంగాణ గురుకులాల కార్యదర్శి , ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమర్‌‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మధ్య వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. పెద్దపల్లి జిల్లా, ధూళికట్టలో బుద్ధ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో స్వేరోస్ సంస్థ ప్రతినిధులు హిందూమత దేవుళ్లను పూజించం, బౌద్ధ మత సిద్ధాంతాలను మాత్రమే ఫాలో అవుతామంటూ చేసిన ప్రతిజ్ఞకు సంబంధించిన వీడియోపై బీజేపీ మత రాజకీయం చేసింది. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు స్వేరోస్ సంస్థకు విదేశాల నుంచి వస్తున్న నిధులపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతానంటూ బండి ప్రవీణ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు.

తెలంగాణలో దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల పిల్లలకు గురుకులాల ద్వారా అత్యున్నత విద్య అందిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బహుజనులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ దిష్టిబొమ్మలు తగలబెడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని స్వేరోస్ సంస్థ ప్రతినిధులు, జై భీమ్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన తప్పేమిటీ అని నిలదీసారు. ఇకనైనా నీ పద్దతి మార్చుకోవాలని బండి సంజయ్‌కు తమ్మినేని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బౌద్దమతాన్ని అనుసరించేవాళ్లు హిందూ దేవుళ్లను పూజించం అంటూ చేసిన ప్రతిజ్ఞలో తప్పేముందని తమ్మినేని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఫలానా మతాన్ని అనుసరించేవాళ్లు..ఇతర మతాల దేవుళ్లను పూజించం అంటూ చెప్పడం మన దేశంలో సహజంగానే జరుగుతుందని, ఆ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను తప్పు పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని తమ్మినేని బండిని నిలదీశారు. హిందూ మతాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించడం లేదని, కాని మతోన్మాదం పనికిరాదన్నదే తమ వాదం అని తమ్మినేని చెప్పుకొచ్చారు.

బీజేపీ నేతలు ఇతర మతాల పట్ల ఉన్నాదం చూపించరాదని హితవు పలికారు. బండి సంజయ్ నువ్వు బౌద్ధమతం పట్ల మతోన్మాదం చూపిస్తున్నావు అంటూ మండిపడ్డారు. స్వేరోస్ సభ్యులు చేసిన ప్రతిజ్ఞ వీడియోలో ఎక్కడా రాముడి గురించో, శ్రీకృష్ణుడి గురించో ఎక్కడా అసభ్యంగా దూషించలేదని చెప్పారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేదంటే తప్పు ఎలా అవుతుంది..ఎవరి మతవిశ్వాసాలు వారివి అంటూ వివరణ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది..ఇక్కడ నాలుగు సీట్లు గెలిచారు కాబట్టి ఐపీఎస్ అధికారి అంతు చూస్తామంటూ మాట్లాడొచ్చా అని బండి సంజయ్‌పై తమ్మినేని మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పట్ల బీజేపీ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందువులలో నిమ్న కులాలను అణిచివేస్తూ కుల వివక్ష పాటిస్తుంటే.. ఎందుకు ఖండించడం లేదని బండిని తమ్మినేని ప్రశ్నించారు. నిమ్న కులాలకు, అగ్ర కులాలకు మధ్య విద్వేషాలు రగిలించి రక్తపు మడుగులు పారించి రాజకీయ లబ్ది పొందాలనుకునే దుర్భుద్ధి సరైనది కాదని బండి సంజయ్‌‌కు క్లాస్ పీకారు. ఇకనైనా బండి సంజయ్ పద్దతి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడతారని తమ్మినేని వీరభద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి తమ్మినేని ఇచ్చిన వార్నింగ్‌కు బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -