భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ దక్షిణ భారత దేశంలో బీజేపీ నేతల్లో కీలకమైన వారు.. “తమిళనాడు మోదీ”గా పార్టీలో ఆయనకు పేరుంది. బీజేపీలో అత్యంత విశ్వాస పాత్రుడు, వివాద రహితుడిగా చెబుతారు. 1957 అక్టోబరు 20న తమిళనాడు లోని తిరుప్పూర్‌లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఆర్‌ఎస్‌ఎస్, జన్ సంఘ్ లతో కలిసి పని చేశారు. ఇప్పుడు ఆ అనుభవమే దేశ రెండో అత్యున్నత పదవిని అధిష్ఠించే స్థాయికి తీసుకెళ్లింది.
సీపీ రాధాకృష్ణన్ 1957 అక్టోబరు 20న తమిళనాడు లోని తిరుప్పూర్‌లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్.. ఇందులో పొన్నుసామి ఆయన తండ్రి పేరు. బీబీఏ పట్టభద్రుడైన సీపీ రాధాకృష్ణన్, కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్, అథ్లెట్‌గా ఉన్నారు. క్రికెట్, వాలీబాల్ క్రీడలపై అమితాసక్తి కనబరిచే వారు. భారత తొలి ఉప రాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పని చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్థాయికి చేరుకోవాలనే కోరికతో ఆయన పేరునే రాధాకృష్ణన్‌కు ఆయన తల్లి పెట్టారు. సీపీ రాధాకృష్ణన్ 16వ ఏట నుంచి ఆర్‌ఎస్‌ఎస్, జన్ సంఘ్ లతో కలిసి పని చేశారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి 1998, 1999 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. అప్పట్లో 93 రోజుల పాటు తమిళనాడు లోని ప్రతి నియోజక వర్గాన్ని చుడుతూ 19 వేల కిలోమీటర్ల మేర రథ యాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరాని తనం, ఉగ్రవాదం నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ 3.89 లక్షల ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన రాధాకృష్ణన్ ఓటమి పాలయ్యారు.
2023 ఫిబ్రవరి 12న తొలిసారి ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఆ మరుసటి రోజు నుంచి తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జులై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయిన ఆయన, ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్. వెంకటరామన్‌ల తర్వాత తమిళనాడు నుంచి ఆ పీఠాన్ని అధిష్ఠించిన మూడో వ్యక్తిగా రికార్డులకెక్కారు.
సీపీ రాధాకృష్ణన్ 1998, 1999లో ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ-జౌళి ఛైర్మన్‌గా, పార్లమెంటరీ కమిటీ-పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, కన్సల్టేటివ్ కమిటీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ అక్రమాలపై దర్యాప్తునకు సంబంధించిన పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలలో సభ్యుడిగా పని చేశారు. 2004లో పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. తైవాన్‌కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందం లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. సీపీ రాధాకృష్ణన్ 2016 నుంచి 2020 మధ్య కాలంలో కాయిర్-కొబ్బరి పీచు బోర్డు ఛైర్మన్‌గా సేవలందించారు. 2020లో కేరళ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులై 2022 వరకు పని చేశారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ, ప్రస్తుతం దేశ రెండో అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు.
Also Read:భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

