భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాదాకృష్ణన్ ఎంపికయ్యారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రాధాకృష్ణన్.
పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొనడం లేదని BRS , BJD ప్రకటించాయి.
2024 జూలై 31న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. 1957 మే 4న తమిళనాడు తిరుప్పూరులో జన్మించిన ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయ్యారు.
1996లో తమిళనాడులో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో కోయంబత్తూరు నుండి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
సంసత్ సభ్యుడిగా ఉన్న సమయంలో, ఆయన వస్త్రాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSUs) పై పార్లమెంటరీ కమిటీ, ఆర్థిక సంబంధిత కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు. 2004లో శ్రీ రాధాకృష్ణన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు.

