వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నవంబర్ 2 నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు జగన్ పాదయాత్ర చేయాలని షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆరునెలల పాటు పాదయాత్ర జరగనుండటంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ పిటిషన్‌ను విచారించిన సీబీఐ న్యాయస్ధానం ప్రతీ శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో జగన్ డీలా పడ్డారు. ఇవాళ జరగాల్సిన వైసీపీ ఎల్పీ సమావేశాన్ని రద్దు చేశారు. ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ పాదయాత్రపై ఏం చేయాలనే దానిపై చర్చించారు. అయితే, జగన్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే, వైసీపీ నేతలు మాత్రం పాదయాత్ర కొనసాగుతుందని చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని…వారంలోని మిగిలిన రోజుల్లో పాదయాత్ర కొనసాగుతుందని… శుక్రవారం నాడు కోర్టుకు జగన్ హాజరవుతారని చెప్పారు. కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో పాదయాత్ర ఎక్కడైతో ఆగుతుందో… విచారణ అనంతరం, మరుసటి రోజు అదే ప్రాంతం నుంచి కొనసాగుతుందని చెబుతున్నారు.