వలస కార్మికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

470
kcr minister
- Advertisement -

దేశవ్యాప్తంగా లాక్​ డౌన్​ నేపధ్యంలో తెలంగాణ గడ్డపై ఉన్న ప్రజలకు ఆరోగ్య భద్రతకు, ఆహార భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో భరోసా కల్పించింది. ఎక్కడి నుంచి వచ్చినా సరే తెలంగాణలో ఉంటున్న వారంతా మా బిడ్డలతో సమానమని, వారికి ఎలాంటి ఆపద రాకుండా, ఆకలితో అలమటించకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఇప్పటికే స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మున్సిపల్​ శాఖ మంత్రి కె.తారకరామారావు పర్యవేక్షణలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల పరిధిలోని పోలీసుల సహకారంతో పురపాలక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన పేదలు, వలస కార్మికులు, పారిశ్రామిక కార్మికుల కుటుంబాలు ఎక్కడి వారు అక్కడే ఉండే విధంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ప్రజలు ప్రస్తుతం వారు ఉన్న చోటు నుంచి కదిలే వీలు లేకుండా పోలీసులు, మున్సిపల్​ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరిస్తుంది. అన్నపూర్ణ కేంద్రాల వద్ద, అసిస్టెంట్స్​​ క్యాంపుల(సహాయక కేంద్రాలు) ద్వారా పేదలకు భోజనాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.

ప్రధానంగా నేషనల్​ హైవేలు,స్టేట్​ హైవేల వెంట ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల అధికారులు ప్రభుత్వ భవనాలు, ఫంక్షన్​ హాళ్లను తీసుకుని పూర్తిస్థాయి అసిస్టెంట్స్​ ​ క్యాంపులుగా మార్చారు. లాక్​ డౌన్​ కారణంగా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరిన వారిని పోలీసులు, మున్సిపల్​ అధికారులు గుర్తించి వారిని అసిస్టెంట్స్​​​ క్యాంపులకు తరలిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆదివారం కాలినడకన ప్రయాణం చేస్తున్న దాదాపు ఐదు వేల మంది(5,000)ని పోలీసులు, మున్సిపల్​ అధికారులు గుర్తించి వారిని స్థానికంగా ఏర్పాటు చేసిన అసిస్టెంట్స్​​ క్యాంపులకు తరలించారు. వరంగల్​ ​మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ పమేల సత్పతి ఐఏఎస్​, కరీంనగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ వి.క్రాంతి ఐఏఎస్​లు తమ కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మహారాష్ట్ర లోని లాతూరు నుంచి ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలకు కాలినడకన ప్రయాణం చేస్తున్న 39 మంది విద్యార్ధులను ఆదివారం(29న) సాయంత్రం బొంగ్లూరు పోలీస్​ పికెటింగ్​ వద్ద పోలీసు సిబ్బంది గుర్తించి ఆదిబట్ల మున్సిపల్​ కమిషనర్​ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో వెంటనే వారిని అప్పటికే పటేల్​గూడ జిల్లా పరిషత్​ హైస్కూల్​ లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ అసిస్టెంట్స్​​ క్యాంపునకు తరలించారు.

ఆదివారం రాత్రి ఆదిబట్ల కమిషనర్​ సరస్వతి వారికి ఆహారం అందించి రాత్రి ఆశ్రయం కల్పించారు. సోమవారం ఉదయం వారందిరికీ(39 మందికి) వైద్య సిబ్బంది ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. వారిలో గుంటూరు జిల్లా(30 మంది), ప్రకాశం జిల్లా(7 మంది), తూర్పు గోదావరి జిల్లా(ఇద్దరు) ఉన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు 39 మంది అక్కడే అశ్రయం పొందే విధంగా ఏర్పాట్లు కల్పించారు. ఇప్పటి వరకు హైదరాబాద్​ శివారు ప్రాంతంలో మున్సిపల్​ అధికారులు ఏర్పాటు చేసిన అసిస్టెంట్స్​​ క్యాంపుల వివరాలు వెల్లడించడం జరుగుతుంది.

- Advertisement -