కూటమిలో కుంపటి.. చీలిక తప్పదా?

22
- Advertisement -

ఇండియా కూటమి ఎక్కువ రోజులు నిలిచే అవకాశం లేదా ? చీలిక దిశగా అడుగులు పడుతున్నాయా ? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న యూపీఏ కూటమి స్థానంలో కొత్తగా ఇండియా కూటమిని ప్రారంభించాయి విపక్ష పార్టీలు. గతంలో ఉన్న యూపీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించేది. కానీ ఇప్పుడున్న ఇండియా కూటమిలో ఏ పార్టీది అగ్రతాంబూలం అనే దానిపై ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పేరే ప్రధానంగా వినిపిస్తున్నప్పటికి కూటమి ఏర్పాటులో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పాత్ర కూడా ఎక్కువగానే ఉంది. దీంతో కీలక పదవుల విషయంలో కూటమిలో విభేదాలు నడుస్తున్నాయనే చర్చ జరుగుతోంది..

గత కొన్నాళ్లుగా కూటమి తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడుతున్నారు అగ్రనేతలు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికి, నితీష్ కుమార్, మమతా బెనర్జీ అఖిలేశ్ యాదవ్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పైగా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకునేందుకు వారంతా ఏమాత్రం సిద్ధంగా లేరనే టాక్ వినిపిస్తోంది. ఇదే కాకుండా సీట్ల పంపకాల విషయంలో కూడా ఎవరికి వారే అన్నట్లుగా కూటమిలో పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలన్నీ చూస్తే కూటమి ఎన్నికల ముందే కూలిపోవడం ఖాయమా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విషయంలో జేడీయూ అధినేత నితిశ్ కుమార్ అసహనంగా ఉన్నట్లు సమాచారం. కూటమిలో ఇతర పార్టీలకు కనీస సమాచారం లేకుండా యాత్ర చేపట్టడాన్ని ఆయన తప్పుబడుతున్నారట. ఈ వ్యవహారాలన్నీకూడా కూటమిలో చీలికకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఎన్నికల ముందు కూటమిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:గుంటూరు కారం పై కొత్త అప్ డేట్లు

- Advertisement -