ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత వంగలపూడి మరోసారి తన మనవత్వాన్ని చాటుకున్నారు. రెండు రోజుల క్రితం తన చంటి బిడ్డను ఎత్తుకుని కూడా ట్రాఫిక్ విధుల్లో పాల్గొన్న రంగంపేటకు చెందిన కానిస్టేబుల్ జయశాంతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. విధి పట్ల ఆమె చూపిన అంకితభావం హోమ్ మంత్రిని కూడా ఆకట్టుకుంది.
ఈ ఘటనపై స్పందించిన హోమ్ మంత్రి అనిత వంగలపూడి ముందుగా కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను నేరుగా కలవాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మంత్రి ఆహ్వానం మేరకు ఇవాళ విజయవాడలోని హోమ్ మంత్రి క్యాంపు కార్యాలయంలో కానిస్టేబుల్ జయశాంతి తన కుటుంబ సభ్యులతో కలిసి హోమ్ మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత వంగలపూడి కానిస్టేబుల్ జయశాంతి కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు. జయశాంతి దంపతులతో కలిసి భోజనం చేసిన హోమ్ మంత్రి, వారికి బట్టలు కూడా బహూకరించారు. విధి నిర్వహణలో మహిళా పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు.
Also Read:కరాటే కళ్యాణిపై దాడి..10 మందిపై కేసు
హోమ్ మంత్రి చూపిన ఈ మానవీయత పోలీసు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచిందని, ప్రజాసేవలో ఉన్న వారికి ఇది పెద్ద ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

