రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఖాకీ కలర్ నిక్కర్ కాలిపోతుంది అంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. ద్వేషం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ నుంచి కూడా విముక్తి పొందేందుకు, ఒక్కొక్క అడుగు వేసి లక్ష్యాన్నిచేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్‌లో పేర్కొన్నది. ఖాకీ నిక్కర్ కాలుతున్న ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఆ పార్టీ. ఇంకా 145 రోజులు ఉన్నాయంటూ ఆ ఫోటోకు నినాదాన్ని జోడించింది. కొన్ని రోజుల క్రితం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఆ ట్వీట్‌లో భారత్ జోడోయాత్ర హ్యాష్‌టాగ్ కూడా పెట్టారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఖాకీ నిక్కర్ కాలిపోతున్న పోస్టును కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాకీ కలర్ షార్ట్‌కు నిప్పు అంటుకున్నట్లు పెట్టిన ఫోటోపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేస్తోంది భారత్ జోడో యాత్ర కాదు అని, అది భారత్ తోడో యాత్ర అని, ఆగ్ లగావో యాత్ర అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. తక్షణమే ఆ ఫోటో ట్వీట్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.