Congress:కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ అస్త్రం!

20
- Advertisement -

ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలగా ఉంది. 2014 అధికారం కోల్పోయిన తర్వాత హస్తం పార్టీ తీవ్రంగా బలహీన పడుతూ వచ్చింది. పైగా మోడీ మేనియాతో బీజేపీ దేశ వ్యాప్తంగా బలం పెంచుకోవడం కాంగ్రెస్ ను మరింత దెబ్బ తీసింది. దాంతో పూర్వ వైభవం కోసం హస్తం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. పైగా ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ కు డూ ఆర్ డై లా మారాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఓటమి చవిచూసిన 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ స్థితిగతులే మారిపోయే అవకాశం ఉంది. పైగా దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బి‌ఆర్‌ఎస్ పార్టీ వంటి పార్టీలు ప్రత్యామ్నాయ శక్తిలుగా ఎదిగే అవకాశం లేకపోలేదు.

అందుకే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హస్తం నేతలు పట్టుదలగా ఉన్నారు. అందులో భాగంగానే గత ఏడాది కాలంగా ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు పార్టీని బలోపేతం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టి పార్టీకి ఎంతో కొంత మైలేజ్ తీసుకొచ్చారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ తర్వాత చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఎన్నికలు దగ్గర పడడంతో మరో ప్రచార కార్యక్రమంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది.

ఇంటింటికి గ్యారెంటీ పేరుతో ‘పాంచ్ న్యాయ్’ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. పాంచ్ న్యాయ్ లో భాగంగా యువ్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, హీస్సేదారి న్యాయ్ కింద 25 గ్యారెంటీ హామీలను ప్రకటించి వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తోంది. గ్యారెంటీల పేరుతో హామీలు ప్రకటించి కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అదే విధంగా కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేందుకు మరోసారి గ్యారెంటీలనే నమ్ముకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నొక్కి చెబుతున్న పాంచ్ న్యాయ్ హామీలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఈ పాంచ్ న్యాయ్ అస్త్రం కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read:TTD: 5న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

- Advertisement -