సాగర్‌‌లో గెలవలేక కాంగ్రెస్ ఎమ్మెల్సీ చవకబారు వ్యాఖ్యలు…!

167
jeevan reddy
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మిగతా కాంగ్రెస్ నేతలతో పోలిస్తే కాస్త హుందాగా పెద్దమనిషిగా వ్యవహరిస్తారని ఇన్నాళ్లు అనుకున్నాం..కానీ ఆయన కూడా ఎన్నికలలో గెలుపు కోసం నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌పై నాన్‌లోకల్ అంటూ ముద్ర వేసి చవకబారు రాజకీయం చేస్తారని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌‌కు , కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దివంగత నోముల నర్సింహయ్య గౌరవంతో సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు భగత్‌కే టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టారు. ఓ పక్క ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జానారెడ్డి, మరోపక్క ఆయన వయసులో సగం కూడా లేని నోముల భగత్.

అయితే సాగర్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 15 ఏళ్లు మంత్రిగా చేసిన జానారెడ్డి చేయలేని అభివృద్ధి, ఏడేళ్లలోనే అది కూడా నోముల గెలిచిన తర్వాత గత రెండేళ్లలోనే టీఆర్ఎస్ హయాంలో జరిగింది. అందుకే సాగర్ ప్రజలు నోముల వారసుడికే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారు. మరోసారి జానారెడ్డి ఓటమి తప్పదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయం మొదలుపెట్టారు. చివరకు కాంగ్రెస్‌లో పెద్దమనిషిగా పేరుగాంచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చీప్ పాలిటిక్స్‌కు తెర తీశారు. తాజాగా నల్గొండ జిల్లా అనుముల మండలం చింత గూడెం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నోముల భగత్ ది నాన్‌ లోకల్‌, సాగర్ ఎన్నికలో అతను గెలిస్తే హైదరాబాద్‌ పోతాడని అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నోముల భగత్‌పై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. నిజానికి నోముల నర్సింహయ్యది నకిరేకల్.. కాని గత సార్వత్రిక ఎన్నికలలో ఆయన్ని ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో సాగర్‌లో పోటీ చేయించి గెలిపించారు. అప్పుడు కూడా నోముల నాన్‌లోకల్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాని విజ్ఞులైన సాగర్ ప్రజలు నిరాండబరుడు, నిస్వార్థపరుడైన నోములను గెలిపించి జానారెడ్డికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత నోముల కుమారుడు భగత్‌పై కూడా కాంగ్రెస్ నేతలు నాన్‌లోకల్ అంటూ ముద్రవేయడం నీచాతినీచం. అలాగైతే కాంగ్రెస్ నేతలు సొంత నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత మరో నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత సార్వత్రిక ఎన్నికలలో సొంత నియోజకవర్గం కొడంగల్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత నాలుగు నెలలకే జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్‌గిరిలో పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. అంటే మల్కాజ‌్‌గిరిలో రేవంత్ రెడ్డి నాన్‌లోకల్ కాదా…అంతెందుకు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నాటి ఉద్యమనేత కేసీఆర్‌పై పోటీ చేయలేదా…అంటే కరీంనగర్‌లో జీవన్ రెడ్డి నాన్ లోకల్ కాదా..పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గం కోదాడ వదిలేసి హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి రెండుసార్లు గెలవలేదా..ఆయన అక్కడ నాన్‌లోకల్ కాదా..గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే భువనగిరిలో ఎంపీగా పోటీ చేసి గెలవలేదా..అంటే మీ కాంగ్రెస్ నేతలకో న్యాయం..నోముల భగత్‌కో న్యాయమా…సొంత ఊరు కాకపోతే పోటీ చేసే అవకాశం లేదా…నోముల భగత్ ముమ్మాటికి నల్గొండ జిల్లా బిడ్డ అంటూ టీఆర్ఎస్ నేతలు జీవన్‌రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా ఆడలేక మద్దెలవోడు అన్నట్లు సాగర్‌లో గెలవలేక ఇలా లోకల్, నాన్‌లోకల్ ఫీలింగ్ తీసుకువచ్చి తమ వయసులో సగం కూడా లేని నోముల భగత్‌పై బురద జల్లడం జీవన్ రెడ్డి లాంటి నేతలకు సబబు కాదు..పెద్ద మనిషి జీవన్ రెడ్డి కాస్తా ఈ వ్యాఖ్యలతో తన చిన్న మనసును బయటపెట్టుకున్నాడు..ఏంటీ బాబాయి.. మీ కొడుకులాంటి భగత్‌పై ఇవేం మాటలు..మీ పద్దతేం బాగాలేదంటూ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డిని నెట్‌జన్లు ఆడేసుకుంటున్నారు.

- Advertisement -