హార్టికల్చర్ అభివృద్ధికి అపార అవకాశాలు: తమిళి సై

42
tamilisai

భారతదేశంలో హార్టికల్చర్ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం హార్టికల్చర్ హబ్ గా ఎదుగుతున్నదని ఆమె అన్నారు. భారత్ ‘ప్రపంచ పండ్లు, కూరగాయల బాస్కెట్’ గా గుర్తింపు పొందుతున్నదని డాక్టర్ తమిళిసై వివరించారు.శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ యూనివర్శిటీ ఛాన్సలర్ హోదాలో స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతదేశంలో రైతుల ఆదాయం రెండింతలు కావాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే హార్టికల్చర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని గవర్నర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటలను పెంపొందించడానికి సబ్సిడీలు, ఇతర అవకాశాలను కల్పిస్తున్నదని చెప్పారు.పాలి హౌసులు, కిచెన్ గార్డెన్ లు, రూఫ్ గార్డెన్ లు ఇతర పద్ధతుల ద్వారా హార్టికల్చర్ కి మంచి ప్రోత్సాహకాలు అందుతున్న ప్రస్తుత సమయంలో రైతులు, ఇతర ఎంటర్ప్రెన్యూర్ లు ఈ అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రంలో హార్టికల్చర్ కి మరింత ఊపు తీసుకురావాలని డాక్టర్ తమిళిసై పిలుపునిచ్చారు.

పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు, పరిశోధకులు తమ చదువును, విజ్ఞానాన్ని, నైపుణ్యాలను రాష్ట్రంలో, దేశంలో హార్టి కల్చర్ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని గవర్నర్ సూచించారు. ప్రజలు కూడా తమ ఇళ్లలో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ లు పెంపొందించుకోవాలని అన్నారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని స్థలాలలో కూడా కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకం చేపట్టాలని పిలుపునిచ్చారు.

రాజ్ భవన్ లో తాము చేపట్టిన పండ్ల మొక్కల పెంపకం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నదని, ఇది తనకు ఎంతో సంతోషదాయకంగా ఉందని ఆమె అన్నారు.కోవిడ్ సంక్షోభం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను అలాగే పండ్లు కూరగాయలు లాంటి బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని రోగనిరోధకశక్తిని పెంచుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది అన్నారు. గత ఆరు సంవత్సరాల కాలంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ మంచి వృద్ధిని సాధించిందని, హార్టికల్చర్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మొత్తం 529 విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు, వీరిలో 16 మంది డాక్టోరల్ పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ తమిళిసై వర్చువల్ పద్ధతిలో ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.