ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణ: కేటీఆర్

57
ktr minister

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించుకోబోతుందని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూరప్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలోని ఏ దేశమైన వైద్య రంగానికి సంబంధించిన సరిపడా మౌలికవసతుల కొరతను ఎత్తిచూపింది అన్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు ఒక సహకార పూరిత ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు గత సంవత్సర కాలంగా నిరంతరం శ్రమిస్తున్నాయని ఈ సందర్భంగా అన్నారు. కరోనా లాంటి మహోమ్మారి పైన సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందన్నారు. భారత కాలమానం ప్రకారం నిన్న అర్ధరాత్రి తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నమెంట్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

జపాన్ దేశం నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో రువాండా కు చెందిన ఐటీ శాఖ మంత్రి పౌల ఇనగంబిరే మరియు ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య,  సాంకేతిక మరియు టెక్నాలజీ కంపెనీల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ “సేవింగ్ లైఫ్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్” అనే అంశంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తమ ప్రభుత్వం ముందువరుసలో ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా భూసంస్కరణలు మరియు ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామన్నారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృధా అని మా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి ఆలోచనా విధానం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు మరియు సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు పోతున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభానికి సంబంధించిన ఆపత్కాలంలో టెక్నాలజీని ఉపయోగించుకొని కరోనా కట్టడి మరియు వైద్య విద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో ముందు వరుసలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. అయితే ఈ రంగాల్లో టెక్నాలజీల వినియోగం ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉందని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రెట్లు ప్రజలకు ప్రయోజనాలు కల్పించే వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో కలిసి ఎమర్జెన్సీ  పరిస్థితుల్లో డ్రొన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని యొక్క హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.