కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు సమాచారం. మంగళవారం న్యూదిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత ఎన్నికలను త్వరలో పూర్తి చేస్తామని గులాం నబీ అజాద్ వెల్లడించారు. ఇది సాధారణమేనని.. పార్టీలోని 2వేల మంది ప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పారు. వారే కాంగ్రెస్‌లోని అత్యున్నత నిర్ణయాత్మక వర్కింగ్ కమిటీని కూడా ఎన్నుకుంటారని ఆయన వెల్లడించారు. 1998 నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె అనారోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం తరచూ అమెరికా వెళ్లాల్సివస్తుండడంతో పార్టీ బాధ్యతలను రాహుల్‌గాంధీకి అప్పగించాలని భావిస్తున్నారు. పార్టీ అంతర్గత ఎన్నికలను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. దాదాపు 2005 నుంచి ఈ ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. నిరుద్యోగాన్ని రూపుమాపడంలో మోడీ విఫలమయ్యారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. వరుస ఎన్నికల వైఫల్యాలతో రాహుల్ నాయకత్వ పటిమపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవి అడ్డుకావడం లేదు.