నల్గొండలో కనిపించని కాంగ్రెస్ నేతలు…!

396
ramulu
- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా, బీజేపీ కూడా స్పీడ్ పెంచింది.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయింది. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు అవకాశాల్లేకపోయినా…ప్రచారంలో మాత్రం పుంజుకుంటున్నారు. ఇక్కడ చిన్నారెడ్డి తరపున ప్రచార బాధ్యతను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన మీద వేసుకున్నాడు.

మల్లు రవి, సీతక్క వంటి నేతలతో రేవంత్ రెడ్డి వర్గం చిన్నారెడ్డి తరపున ప్రచారం చేస్తోంది. అయితే ఇక్కడ పోటీ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణి, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్యనే అని తేలిపోయింది. నిన్న, మొన్నటి వరకు ప్రభుత్వంతో అంటీ ముట్టనట్లు వ్యవహరించిన ఉద్యోగ సంఘాల జేఏసీ మంత్రుల రాయబారం తర్వాత టీఆర్ఎస్‌కు జై కొట్టింది. దీంతో ఇక్కడ పీవీ వాణి గెలుపు దాదాపు ఖాయమని తెలుస్తోంది. మరోవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక్కడ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో అందరికంటే ముందున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున బండి సంజయ్, డీకే అరుణ వంటి నేతలు రంగంలోకి దిగారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. రాణిరుద్రమ, చింతపండు నవీన్ కుమార్‌లు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

కాని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ మాత్రం ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయారు. నిజానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలంతా ఈ మూడు జిల్లాలలోనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి ఉద్దండ నేతలు ఈ మూడు జిల్లాలలోనే ఉన్నారు. అయితే పీసీసీ అధ్యక్ష పదవి తమకు దక్కే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ సీనియర్లు అంతా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఒక్క ఉత్తమ్ మాత్రమే రాములు నాయక్‌తో కలిసి ప్రచారంలో కిందామీదా పడుతున్నారు. పట్టభద్రుల దగ్గరకు వెళ్లి ఓట్లు అభ్యర్థించడం సంగతి తర్వాత..ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లను కూడా పలకరించే దిక్కు కూడా లేకపోయింది. ఈ మూడు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులైన పట్టభద్రులు వేలాదిగా ఉన్నారు. వీళ్లు పక్కా కాంగ్రెస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇలాంటి వారిని కూడా కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టభద్రులలోనే తీవ్ర అసంతృప్తి రగులుతోంది.

కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు లేకపోవడం.. మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించకపోవడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు ఎవరనే దానిపై ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం నెలకొంది. మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జులు ఉన్నా.. క్షేత్రస్థాయిలో పట్టభద్రులను కలిసి ఓట్లు అడగడంలో ఘోరంగా విఫలమవుతున్నారనే చెప్పాలి. పీసీసీ అధ్యక్ష పదవి కోసం కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. జానారెడ్డి వంటి సీనియర్ నేత సాగర్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్యలు ఉన్నా..క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలంగానే ఉంది. అయితే ప్రచారంలో కీలక నేతలెవరూ కనిపించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పార్టీ అనుబంధ సంఘాలు, సానుభూతిపరులైన పట్టభద్రులు డోలాయమానంలో పడ్డారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందే రెండు పట్టభద్రుల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసినట్లే అని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -