రేవంత్‌కు దిమ్మతిరిగే షాక్.. మరోసారి సీనియర్ల తిరుగుబాటు..

111
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై ఆ పార్టీలోని కొందరు సీనియర్లు మరోసారి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్ నేతలు ఒక్కటవుతున్నారు. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య, వీ. హనుమంతరావు, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి తదితరులు ప్రత్యేకంగా సమావేశమై రేవంత్‌ రెడ్డి పై అధిష్టానికి ఫిర్యాదుచేయాలని నిర్ణయించారు. రేవంత్ త‌న ఒంటెద్దు పోక‌డ‌ల‌తో వ‌న్‌మెన్ షో చేస్తున్నార‌ని.. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే పార్టీ పూర్తిగా ఒక్క‌రి చేతుల్లో బందీ అవుతుంద‌ని సీనియర్లు అభిప్రాయపడ్డారు. వీహెచ్‌ తన‌కు మంచిర్యాల‌లో జ‌రిగిన అవ‌మానం ఉద్దేశపూర్వ‌కంగానే జ‌రిగింద‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జంగా రాఘ‌వ‌రెడ్డి పెత్త‌నం ఎక్కువైంద‌ని.. త‌న‌కు స‌మాచారం లేకుండా కార్య‌క్ర‌మాలు జ‌రిగిపోతున్నాయ‌ని పొన్నాల సీరియస్ అయ్యారు. మర్రి శశిధర్ రెడ్డి సైతం రేవంత్ తీరుపై ఆవేదన వ్యక్తం చేయగా దీనిపై అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో భేటీ కావాల‌ని నిర్ణయించడం రేవంత్ వర్గానికి మింగుడుపడటం లేదు. ఇప్పటికే రేవంత్‌ వ్యవహార శైలితో కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, ఆయన పీసీసీ చీఫ్‌ గా కొనసాగితే పార్టీకి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవనే విషయాన్ని కేంద్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకులు ముక్తకంఠంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేవంత్‌ వ్యవహార శైలితో కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని, పార్టీలో సీనియర్లు, జూనియర్లు, టీడీపీ పార్టీ నుంచి వలస వచ్చిన వారు అనే భేదాలు ఉన్నాయని, ఈ పద్దతి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో మనుగడ కష్టమని, ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డిని తప్పించి కొత్తవారికి పీసీసీ అధ్యక్షుడిగా ఛాన్స్‌ ఇవ్వాలని, లేదంటే రేవంత్‌ దూకుడు కళ్లెం వేసి ఆయనను అదుపులో పెట్టి, పార్టీలో అందరికి సమ ప్రాధాన్యం తగ్గేలా అందరిని కలుపుకుపోవాలని రహస్యంగా భేటీ అయిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ పునాదులు బలంగా ఉన్నాయని, అందులో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగ్గా ప్రజాదరణ ఉందని, రేవంత్ తీరుతో కాస్త పార్టీ మరింత బలహీన పడే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మొదలైన రచ్చ టీ కప్పులో తుఫానులా ఉంటుందా.. లేదా జడివానలా మారి రేవంత్‌ రెడ్డి పదవికే ఎసరు వస్తుందా అనేది చూడాలి.

- Advertisement -