కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌..!

24
Congress

తెలంగాణలో కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌ త‌గిలింది. కుత్బుల్లా‌పూర్ మాజీ ఎమ్మెల్యే,మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కొంత కాలంగా ఆయ‌న‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ నేత‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. శ్రీశైలంతో కొన్ని రోజులుగా బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ ఢిల్లీ వెళ్లగా ఈ రోజు ఉదయం కూన శ్రీశైలం కూడా అక్క‌డ‌కు బయలుదేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ వీడి బీజేపీలో చేరుతున్నానని కూన శ్రీశైలం గౌడ్‌ ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉంటున్నానని, 2009లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడానని తెలిపారు.గత ఏడేండ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజాసమస్యలపై పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమయ్యిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలోనూ కాంగ్రెస్‌ విఫలమయ్యిందన్నారు.