తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పీసీసీ కమిటీల నియామకాలపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియాపై చేసిన వ్యాఖ్యలకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ సందర్బంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదననే చెప్పానని, కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ అర్ధం చేసుకోవాలని కోరారు. ఎవరినో వ్యక్తిగతంగా దూషించాలని కానీ పార్టీకి చెడు చేయాలని గానీ తనకు లేదని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తమలాంటి వారిని పక్కనబెట్టారు. ‘‘నాకు షోకాజ్ కాదు.. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రెండు రోజుల సమయం అక్కర్లేదు. రెండు గంటల్లో జవాబు చెప్తున్నా’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.