నియంత్రిత పంటల ప్రణాళికలు సిద్ధం చేయండి..

535
Collector Amoy Kumar On Comprehensive Agricultural Policy
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేసేందుగాను రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయి ప్రాణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి, మార్కెట్ డిమాండ్ ఏ పంటకు ఉంది, శాస్త్రీయ విధానం ద్వారా పంటల సాగు, రైతు బంధు క్లష్టర్లలో రైతు వేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విత్తనాల సరాఫరా, మెకనైజెషన్ ఇన్వెంటరీ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం కలెక్టర్లు, రైతు బందు సమితీల అధ్యక్షులు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ హరీష్, జిల్లా రైతుబంధుజిల్లా కోఆర్డి నేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గీత, డీ.ఆర్.డీ.ఏ పీడీ ప్రశాంత్ కుమార్‌లు జిల్లాలోని రెవిన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు ప్రతినిధులు తదితర అధికారులతో మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ అమయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో కాకుండా రైతులు తమపంటలకు మంచి గిట్టుబాటు ధర లభించేలా సాగుబడిలో గణనీయమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇందుకనుగుణంగా జిల్లాలోనూ పంటల సాగులో మార్పులు తెస్తున్నామని అన్నారు. మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర, తగు దిగుబడి లేకపోవడం వల్ల ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మక్కజొన్న పంటను వేయవద్దని పేర్కొన్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన పట్టి, వారి, కందులు, కూరగాయల సాగు విస్తీర్ణంలో పెద్దగా మార్పులు ఉండవని అన్నారు. అయితే వారి సాగు చేసే రైతులు మాత్రం ప్రభుత్వం అందించే సన్న రకాల విత్తనాలను వేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. వరి రైతులకు విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు;ల ప్రకారం జిల్లా వ్యవసాయ అధికారులు సూచించినా విధంగానే పంటలను వేయాల్సి ఉంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో గత వర్షాకాల సీజన్‌లో 14384 హెక్టార్లలో వరి పంట, 87423 హెక్టార్లలో పట్టి పంటను, 7251 హెక్టార్లలో కంది, 18603 ఇతర పంటలు,43404 హెక్టార్లలో మొక్కజొన్నపంటలు వేయడం జరిగిందని వివరించారు. వ్యవసాయ అధికారులు సంబంధిత రైతుబంధు సమితిలు ఉమ్మడిగా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుత వర్షాకాల పంటలను నిర్ణయిస్తారని, దీనికనుగుణంగా పంటలను వేయాల్సి ఉంటుందని తెలియజేశారు.

రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కజొన్న పంటను వెయ్యొద్దని రైతులకు సూచించారు. మండలాల్లోని స్టాక్ పాయింట్లు, ప్రాథమిక సహకార సంఘాల్లో ఎరువులను అందుబాటులో ఉంచామని, రైతులు ఇప్పటినుండే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా పంటల సాగుపై రైతులను చైతన్య పర్చాలని మండల, గ్రామ రైతు బందు కోఆర్డినేటర్లను లక్ష్మా రెడ్డి కోరారు.

రైతు వేదికల నిర్మాణం..

రంగారెడ్డి జిల్లాలో 87 రైతు బందు క్లస్టర్లున్నాయని, ఈ వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం చేపట్టనున్నటు జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటించారు. రైతులు తమప్రాంతంలో ఏవిధమైన పంటలు వేయాలి, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు, ఇతర అంశాలను చర్చించుకునేందుకై ఈ రైతు వేదికలు ఉపయోగ పడతాయని వెల్లడించారు. రానున్నఐదారు నెలల్లోగా ఈ రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించించిందని, ఇందుకనుగుణంగా భూ సేకరణను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణాలకు భూమిని అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రంగారెడ్డి జిల్లాలో 281766 మంది రైతులకు రైతు బంధు వర్తింపు..

రంగారెడ్డి జిల్లాలో 281766 మంది రైతులకు రైతు బంధు పధకం వర్తింప చేస్తున్నామని, అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సూచించిన విధంగా పంటలు వేసిన వారికే రైతు బంధు అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పంటల విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయవద్దని ప్రధానంగా వరి విత్తనాలు ప్రభుత్వం నిర్దేశించిన కేంద్రాల వద్దనే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. స్థానిక చెరువులు, కుంతలా నుండి వ్యవసాయ భూముల్లో ఉపయోగించడానికి చెరువు మట్టిని తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని స్పష్టంచేశారు. జిల్లాలో ప్రస్తుత వర్షాకాలంలో కాకుండా యాసంగిలో మొక్కజొన్న పంటను వేయాలని సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కందులకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుందని, ఈసారి కూడా రంగారెడ్డి జిల్లాలో కంది పంట వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పంటల విధానం పై ప్రణాళికలు రూపొందించండి..

రంగారెడ్డి జిల్లాలో భూముల స్వభావాన్ని బట్టి పంటల సాగుపై ప్రణాళికలను వెంటనే రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, రెవిన్యూ, రైతు బంధు సమితిలు భాద్యులు ఉమ్మడిగా ఈ ప్రణాళికలను రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి, నెల స్వభావం, విత్తనాల లభ్యత, మార్కెటింగ్ సౌలభ్యం, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలను పరిగణలో తీసుకొని సవివరమైన ప్రాణాళిక రూపొందించాలని ఆదేశించారు. డిమాండ్ సరఫరా, మార్కెట్‌లో మంచి ధరలు, అధిక దిగుబడి పంటలు, యాంత్రికీకరణ, వ్యవసాయ యంత్రాల అందుబాటు తదితర అంశాల ఆధారంగా జిల్లాలో వ్యవసాయ క్లస్టర్ల ప్రాతిపదికగా నియంత్రిత పంటల విధానాన్నిరూపొందించాలని తెలిపారు. ప్రతి క్లస్టర్ ప్రామాణికంగా ఏ పంటలు వేయాలో, నేలల పరిస్థితి, మంచి దిగుబడి, మంచి ధర తదితర అంశాల ప్రాతిపదికగా ఈ విధానం ఉండాలని తెలియ చేశారు. జిల్లాలో మొక్కజొన్న, వరి విత్తనాల విక్రయాలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఏ జిల్లాలో రైతులు ఎరువులను కొనుగోలు చేసేందుకు డీలర్ల వద్ద సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా, ఇప్పటినుండే ఎరువులు కొనుగోలుచేస్తే ముందు ముందు రష్‌ను నివారించవచ్చని అన్నారు.

గిడ్డంగుల నిర్మాణాలకు ప్రాధాన్యత..

జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను నిలువ చేసేందుకు గాను గిడ్డంగుల నిర్మాణాలకు స్థలాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 78100 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 29 గోదాములున్నాయని వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆయా మండలాలలో పంటల ప్రణాళికలపై కలెక్టర్ అమయ్ కుమార్ సమీక్షించారు.

- Advertisement -