తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుచ్చి కలెక్టర్ శివరాసు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబసమేతంగా ఎస్‌ఆర్‌ఎం హోటల్‌లో విశ్రాంతి తీసుకుని శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో పెరియ కోయిల్ స్వామి దర్శనం చేసుకున్నారు. వెంట వచ్చిన కుటుంబసభ్యులు కూడా స్వామిని దర్శనం చేసుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ నిర్వహణ బాగుందన్నారు. తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరంగం ఆలయానికి ఇది నా 2 వ సందర్శన, చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయం చక్కగా నిర్వహించబడుతోంది. అందుకు తమిళనాడు ప్రభుత్వానికి అభినందనలు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తమిళనాడుకు వచ్చానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రేపు సాయంత్రం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం కేటాయించారు. ఆయన్ను కలవడానికి వెళ్తున్నాను అని కూడా సీఎం కేసీఆర్ అన్నారు.