తెలంగాణ సీఎం కేసీఆర్ కోమటిబండ పర్యటనలో భాగంగా సింగాయపల్లికి చేరుకున్నారు. అక్కడ అటవీ పునరుద్దరణ పథకం కింద 1500 ఎకరాల్లో చేపట్టిన అటవీ పునరుద్దరణ పనులను సీఎం కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత కలెక్టర్లతో సమావేశమయ్యారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలు.. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైనా కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని.. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగని విధంగా పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని సీఎం తెలిపారు.