వాసాలమర్రిలో రేప‌ట్నుంచే ద‌ళిత బంధు అమ‌లు- సీఎం కేసీఆర్

163
kcr
- Advertisement -

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ ప్ర‌పంచం మొత్తం మీద జ‌రిగిన కొన్ని దుర్మార్గాలు, ప‌నికిరాని విష‌యాల‌తో మ‌న దేశమే కాదు, యావ‌త్ ప్ర‌పంచంలోని కొన్ని కోట్ల మంది బాధ‌లో ఉన్నారు. భార‌త్‌లో నిర్ల‌క్ష్యానికి, అణ‌చివేత‌కు, వివ‌క్ష‌కు గురైన‌ జాతి ద‌ళిత‌జాతి. అలాంటి ద‌ళితుల్లో ఐక‌మ‌త్యం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వాసాల‌మ‌ర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాం. రేప‌ట్నుంచే ద‌ళితుల చేతుల్లో రూ. 10 ల‌క్ష‌ల చొప్పున డ‌బ్బులు ఉంటాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 30 కోట్ల‌తో ద‌ళిత ర‌క్ష‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

వాసాల‌మ‌ర్రి ప‌ర్య‌ట‌న‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్ప‌టికీ ఏ ఊరికి, జిల్లాకు పోయినా.. ఆ ఊరి సెంట‌ర్లో నిల‌బ‌డి.. నిరుపేద‌లు ఎవ‌రని అడిగితే ద‌ళితులే అని చెబుతారు. కొంద‌రు మ‌హాత్ములు ప్ర‌య‌త్నాలు చేశారు. అలా గొప్ప వ్య‌క్తి డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్.. ఈ ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పి.. అనేక‌మైన పోరాటాలు చేశారు. అంబేడ్క‌ర్ పోరాటం వ‌ల్ల రాజ‌కీయంగా, చ‌దువుకునేందుకు, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చాయి. ఆయ‌న ద‌ళితుల‌కు మార్గం చూపించారు. కానీ పూర్తిస్థాయిలో జ‌ర‌గ‌లేదు. ద‌ళితులు పేద‌రికంలో ఉన్నార‌నేది నిజం. ద‌ళితులు రోజు చెమ‌ట్చోడిన‌ప్ప‌టికీ.. ఎందుకు పేద‌రికంలో ఉండాల్సి వ‌చ్చింది? అయితే ప్ర‌భుత్వాలు స‌రైన పంథాలో వెళ్ల‌క‌పోవ‌డం. వారి కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను ఆ వ‌ర్గాల్లోకి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల ద‌ళితులు పేద‌రికంలోనే ఉన్నారు. ద‌ళిత బంధు డ‌బ్బుల‌తో ఇష్ట‌మొచ్చిన వ్యాపారం ప‌ద్ధ‌తిగా చేసుకోవాల‌ని సీఎం సూచించారు.

ప్ర‌భుత్వం ఏమ‌న్న సాయం చేసిన‌ప్పుడు.. ఆరునూరైనా స‌రే ఏ ప‌థ‌కం కూడా నీరుగారి పోవ‌ద్దు. ప‌ట్టుబ‌ట్టి చాలా గ‌ట్టిగా మొండి ప‌ట్టుద‌ల‌తో పైకి రావాలి. ద‌ళిత వాడ‌ల్లో బాగా ఐక‌మ‌త్యం రావాలి. అంద‌రూ ఒక‌టిగా ఉండి.. పోలీసు కేసుల‌కు దూరంగా ఉండాలి. కేసుల‌ను ర‌ద్దు చేసుకుని, ప్రేమ భావంతో మెల‌గాలి. ఒక నియోజ‌క‌వ‌ర్గం(హుజురాబాద్) మొత్తం తీసుకుని ద‌ళిత‌బంధును అమ‌లు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఊర్లో గ‌వ‌ర్న‌మెంట్ స్థ‌లం 612 ఎక‌రాల భూమి ఉంది. ద‌ళితుల వ‌ద్ద చాలా త‌క్కువ స్థ‌లం ఉంది. క‌బ్జా పెట్టిన భూముల‌పై విచార‌ణ జ‌రిపించాం. వారి వివ‌రాల‌ను సేక‌రించాం. ఈ గ్రామంలో మొత్తం 76 ద‌ళిత కుటుంబాలు ఉన్నాయి. వాసాల‌మ‌ర్రిలో 100 ఎక‌రాల‌కు పైగా ప్ర‌భుత్వ మిగులు భూమి ఉంది. ప్ర‌భుత్వ మిగులు భూముల‌ను ద‌ళిత కుటుంబాల‌కు పంపిణీ చేస్తాం. ద‌ళితుల భూమిని మ‌రెవ్వ‌రూ తీసుకునే అర్హ‌త లేదు. ప్ర‌తి ద‌ళిత బిడ్డ రైతు కావాలి. వాసాల‌మ‌ర్రిలో కొత్త చ‌రిత్ర సృష్టించాలి అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ ఊరు స‌రిగా లేనందునే అభివృద్ధి చేయాల‌ని కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటున్నాం. ఇవాళ గ్రామం మొత్తం తిరిగాను. కొన్ని ఇండ్లు మ‌ట్టితో ఉన్న‌వి. ఒక్క‌టి కూడా ఇటుక‌ల ఇల్లు క‌న‌బ‌డ‌లేదు. కూలిపోయే ద‌శ‌లో ఇండ్లు ఉన్నాయి. వ‌ర‌ద నీళ్లు ఇండ్ల‌లోకి వ‌చ్చే విధంగా గ్రామం ఉంది. మొత్తం ఊరు కూల‌గొట్టి.. మంచిగా చేసుకుందాం. రోడ్లు, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వీధి దీపాల‌ను ఏర్పాటు చేసుకుందాం. ఎర్ర‌వెల్లిలో ఊరు మొత్తానికి కూల‌గొడితే ఊరోళ్లు ఎక్క‌డ ఉండాలి అనే ప్ర‌శ్న వ‌చ్చింది. మ‌ద్రాస్ నుంచి ప్ర‌త్యేక‌మైన టెంట్ల‌ను తెప్పించి.. దాంట్లో ఉంచాం. ఊరు క‌ట్టిన త‌ర్వాత అంద‌రూ ఇండ్ల‌లోకి వ‌చ్చారు. వాసాల‌మ‌ర్రిలో కూడా అలా జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా. గొప్ప మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంజినీరింగ్ ప‌ద్ధ‌తుల్లో ఇండ్లు నిర్మించుకుంటే సుఖ‌జీవ‌నం ఉంటుంది. ద‌ళితులే కాదు బీసీలు కూడా పేద‌రికంలోనే ఉన్నారు.. వారిని కూడా ఆదుకుందాం. అలా ఊరంతా బాగుప‌డుతుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -