హుస్నాబాద్ లో జరుగుతున్నటీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ‘ప్రజా ఆశిర్వాద సభ’కు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. కనుచూపుమేర తెలంగాణ ప్రజలు బారులు తీరారు. ఈ సభకి హాజరైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలక్షన్ ఎందుకు వచ్చిందో నిన్ననే చెప్పానని, దానికి దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు కేసీఆర్. హుస్నాబాద్ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ కళ్ళముందే ఉన్నాయని..చైతన్యవంతమైన హుస్నాబాద్ ప్రజలు ఆలోచన చెయ్యాలని అన్నారు.
సమైఖ్య పాలనలో శిథిలమైన తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం మీద కాంగ్రెస్ చేసిన ఏ ఒక్క ఆరోపణా రుజువు చేయలేదని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కేసీఆర్.
సొంత ఆర్థిక వనరులతో తెలంగాణ చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించిందని, వృద్ది రేటులో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని గుర్తుచేశారు. వచ్చిన ఆదాయం ప్రజలకోసమే ఉపయోగించామని, జీవన విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని బాగుచేయడానికి నోరుగట్టుకొని, కడుపుకట్టుకొని పని చేశామని తెలిపారు. శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా సంక్షేమ పథకాలను రూపకల్పన చేశామన్నారు.
రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే..గులాబీకండువా కప్పుకొని ప్రచారం చేస్తా అని జానారెడ్డి అన్నారని, ఇప్పుడు జానా రెడ్డి కి కళ్ళుంటే.. 24 గంటల కరెంట్ వస్తుందో..లేదో చెప్పాలన్నారు. అంతేకాకుండా జానారెడ్డికి కళ్ళు కనిపించకుంటే.. ఉచిత కంటి వైద్యశిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు సీఎం.
ఈ సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేసీఆర్ ..కాంగ్రెస్ పాలనలో ఎంత చితికిపోయామో దానికి హుస్నాబాదే నిదర్శనమని, కరువుకి కాంగ్రెస్సే కారణమని చెప్పుకొచ్చారు. ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. తెలంగాణలో 31జిల్లాలను, జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యలేని పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కేసీఆర్ మాత్రమే చేశాడని చెప్పారు. ప్రతిపక్షాల నోరుమూయించాలంటే.. మళ్ళీ గులాబీజండా రెపరెపలాడాలని తెలంగాణ ప్రజలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.