కలప దొంగలపై కఠిన చర్యలు: సీఎం కేసీఆర్

241
- Advertisement -

కలప దొంగలను ఎట్టి పరిస్ధితుల్లో క్షమించబోమని…చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశామన్నారు.నర్సాపూర్ అటవీ పార్కును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్…తాను స్వయంగా ఈ రోడ్డుపై కారు నడుపుకుంటూ తిరిగేవాడినని తెలిపారు. ఆ రోజుల్లో ప్రతిరోజు ఏదో సినిమా షూటింగ్ జరిగేదని అంత దట్టంగా అడవి ఉండేదని కానీ ఈ రోజు ఆ అడవి అందరం చూస్తుండగానే మాయమైపోయిందన్నారు.

వందకు వందశాతం హరితహారం కార్యక్రమం ద్వారా తిరిగి పాతరోజులు రావాలన్నారు. నర్సాపూర్ అడవి తిరిగి వాపస్ రావాలని ఇందుకోసం స్దానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు తోడ్పాటునందించాలన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని హరితహారానికి కావాల్సినన్ని డబ్బులు ఇస్తామన్నారు. తెలంగాణ అద్భుత రాష్ట్రమని ఇది అధికారికంగా చెబుతున్నానని తెలిపారు సీఎం కేసీఆర్.

రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే మంచి ఫలితాలు వస్తాయని…ఇందుకు నిదర్శనం దేశానికే 55 శాతం వడ్లను తెలంగాణ అందించిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. కరెంట్ సమస్యను అధిగమించామన్నారు. నర్సాపూర్‌కు త్వరలో కాళేశ్వరం నీళ్లు వస్తాయని చెప్పారు. ఏడాదిలోగా నర్సాపూర్‌కు నీళ్లు అందిస్తామన్నారు.

నర్సాపూర్‌లో కొల్పోయిన అడవీ తిరిగిరావాలన్నారు. డబ్బు ఎంత సంపాదించిన ముందు తరాలు బ్రతకగలిగే వాతావరణం లేకుండా ఏం ప్రయోజనం అన్నారు. రాష్ట్రంలో అడవులను కాపాడుకోవడం, చెట్లను పెంచడం అటవీ శాఖ బాధ్యతే కాదు ప్రజల బాధ్యత అన్నారు.సమైక్య రాష్ట్రంలో అడవులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు.

మళ్లీ పాత అడవులు ఖచ్చితంగా రావాలన్నారు. తెలంగాణలో ప్రతి ఊరిలో నర్సరీ ఉందని గత 70 ఏళ్ల సమైక్య పాలనలో ఎందుకు ఈ ఆలోచన చేయలేదన్నారు. భారతదేశంలో ప్రతిగ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తండాలను గ్రామా పంచాయతీలు చేయాలని లంబాడాలు తరతరాలు కొట్లాడరని…వాటిని నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.రైతులు ఎవరిపై ఆధారపడకుండా పెట్టుబడి పెట్టే పరిస్ధితి రావాలన్నారు.

నర్సాపూర్‌లో ప్రతీ గ్రామానికి రూ. 20 లక్షలు, మండల కేంద్రాలకు కోటి రూపాయలు, మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. అందరి సహకారంతో నర్సాపూర్‌ని అభివృద్ధి చేయాలన్నారు.

- Advertisement -